Manu Bhaker: జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు

  • విద్యార్థుల భాషపై దేశ వ్యాప్తంగా చర్చ
  • జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు
  • ఎక్స్‌లో కీలక పోస్ట్ చేసిన ఒలింపిక్ విజేత
Manu Bhaker

Manu Bhaker

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన విద్యార్థుల ఉద్యమంలో నిరసనకారులు ఉపయోగించిన భాషపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు ప్రభుత్వాన్ని, దేశ ప్రధానిని దూషించడంతో దిగ్భ్రాంతికరంగా మారింది. ఇప్పటికే ప్రధాని మోడీ క్షమిస్తున్నట్లు చెప్పారు. తాజాగా పలువురు ప్రముఖులు విద్యార్థుల భాషను తప్పుపడుతున్నారు.

ఒలింపిక్ విజేత షూటర్ మను భాకర్ కూడా తప్పుపట్టారు. దూషించడం మంచిది కాదని హితవు పలికారు. యువతలో పెరుగుతున్న దుర్భాషల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేశారు. తిట్టడం ఎప్పటికీ ‘కూల్’ కాదని.. ఒక వ్యక్తి తన మాటల ద్వారానే గుర్తింపు పొందుతాడని పేర్కొన్నారు. జెన్-జీ తరం వారి అసభ్య పదజాలంపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో ప్రజలు తమ భాషను, పదాలను వివేకంతో ఎంచుకోవాలని కోరారు.

మను భాకర్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఇలా రాశారు. ‘‘మనం ఉపయోగించే భాష మన ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మీ మాటలను తెలివిగా ఎంచుకోండి. ఎందుకంటే కాలక్రమేణా మీరు ఆలోచించే, చెప్పే, చేసే దానిగానే మారిపోతారు. ఈ రోజుల్లో తిట్టడాన్ని ఆత్మవిశ్వాసానికి లేదా ఆధునికతకు చిహ్నంగా భావిస్తున్నారని, కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. తిట్టడం కూల్ కాదు. దూషణ భాషను ఉపయోగించడం ఎప్పటికీ కూల్ కాదు.’’ అని పేర్కొన్నారు. యువతకు ‘కూల్’ అనే పదానికి తన నిర్వచనాన్ని కూడా పంచుకున్నారు. నిజమైన ‘కూల్‌నెస్’ అంటే కష్టపడటం, ఇతరులను, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, నిజాయితీగా విజయం సాధించడం, మీ తల్లిదండ్రులకు, దేశానికి కీర్తిని తీసుకురావడం అని తెలిపారు.

ఇటీవలి కాలంలో దుర్భాషలు సర్వసాధారణం అయిపోయినందువల్లే తాను ఈ విషయాన్ని లేవనెత్తానని స్పష్టం చేశారు. చాలా మంది దానిని సాధారణమైనదిగా లేదా ఫ్యాషన్‌గా భావించి, ఆలోచించకుండానే రోజువారీ సంభాషణలో దుర్భాషలను ఉపయోగించడం మొదలుపెట్టారని గుర్తుచేశారు.

ఈ విషయంపై పలువురు ఇతర ప్రముఖులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం అసమ్మతి తెలిపే హక్కును ఇస్తుంది కానీ.. అవమానించే హక్కును ఇవ్వదని నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ఒక వ్యక్తిని వారి మాటల ద్వారానే గుర్తిస్తారని, భాష గౌరవాన్ని లేదా అగౌరవాన్ని నిర్ణయిస్తుందని నటుడు అశుతోష్ రాణా తెలిపారు. అంతకుముందు, బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కూడా నిరసనల సమయంలో ఉపయోగించిన భాషపై తీవ్రంగా వ్యాఖ్యానించారు.