Mansarovar Yatra: మానస సరోవర్ యాత్రపై నేపాల్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..

  • మానస సరోవర్ యాత్రపై నేపాల్ అభ్యతరం..
  • ఘాటుగా స్పందించిన భారత్..
  • లిపులేఖ్ మా ప్రాంతమంటూ నేపాల్ వాదన..
Nepal

Nepal

Mansarovar Yatra: ‘‘మానస సరోవర్ యాత్ర’’పై నేపాల్ అభ్యతరం చెబుతోంది. లిపులేఖ్ మీదుగా సాగే ఈ యాత్ర మార్గం నేపాల్ వ్యతిరేకించింది. భారత్, చైనాలకు దౌత్యపరమైన నిరసన తెలిపింది. ఈ పరిణామం తర్వాత భారత్ ఘాటుగా స్పందించింది. కాఠ్మాండు చేస్తున్న ప్రాదేశిక వాదనల్ని తోసిపుచ్చింది. “1954 నుండి కైలాస మానస సరోవర యాత్రకు లిపులేఖ్ కనుమ (Pass) ఒక దీర్ఘకాలిక మార్గంగా ఉంది. ఇది కొత్తగా వచ్చిన పరిణామం ఏమీ కాదు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ మే 3న పేర్కొంది. ఇలాంటి వాదనలు సమర్థనీయం కాదని, అలాగే చారిత్రక వాస్తవాలు, ఆధారాలపై నేపాల్ వాదనలు ఆధారపడి లేవని, నేపాల్ చేస్తున్న ప్రాదేశిక వాదనలు, కృత్తిమంగా విస్తరించుకునే ఇలాంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని భారత్ చెప్పింది. ఇదే సమయంలో చర్చలు, దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని చెప్పింది.

లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ అనే మూడు ప్రాంతాలపై నేపాల్ తన ప్రాదేశిక వాదనల్ని చేస్తోంది. ఈ ప్రాంతాలు చారిత్రాత్మకంగా భారత్‌లో భాగంగా ఉన్నాయి. గతంలో నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి ఉన్న సమయంలో ఈ మూడు ప్రాంతాలను నేపాల్ తన మ్యాప్‌లో భాగంగా చూపించింది. ఆ సమయంలో భారత్ నుంచి తీవ్ర స్పందన వచ్చింది.

Read Also: Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?

‘‘1816 సుగౌలి ఒప్పందం ప్రకారం, లింపియాధుర, లిపులేఖ్ మరియు కాలాపాని నేపాల్‌లో అంతర్భాగాలని నేపాల్ ప్రభుత్వం స్పష్టంగా మరియు దృఢంగా ఉంది’’ అని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ పౌడ్యాత్ ఛెత్రి మాట్లాడుతూ.. నేపాల్ తన ఆందోళనలను దౌత్య మార్గాల ద్వారా న్యూఢిల్లీ మరియు బీజింగ్ రెండింటికీ తెలియజేసిందని అన్నారు. రాజకీయ పార్టీలతో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. లిపులేఖ్ నేపాల్ భూభాగమని చైనాకు తెలియజేసినట్లు చెప్పారు. ఈ వివాదాస్పద ప్రాంతంలో కార్యకలాపాలు నిలిపేయాలని అన్నారు.

ఈ వివాదాస్పద ప్రాంతంలో రహదారుల నిర్మాణం, విస్తరణ, సరిహద్దు వాణిజ్యం, తీర్థయాత్రలకు సంబంధించిన కార్యకలాపాలు చేపట్టవద్దని భారత్‌ను నేపాల్ కోరింది. ఇదే సమయంలో భారత్ నేపాల్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని చర్చల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి నేపాల్ కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.