Manmohan Singh: భారతదేశ ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, 1991లో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఆర్థికవేత్త, రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్(92) గురువారం ఎయిమ్స్‌లో మరణించారు. దాదాపుగా దివాళా అంచున ఉన్న దేశాన్ని, ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చిన ఘనత మన్మోహన్ సింగ్‌కి దక్కుతుంది. అప్పటి వరకు లైసెన్స్ రాజ్, బ్రూరోక్రసీ ఆధిపత్యంలో కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థగా మార్చారు. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్‌కి దారులు తెరిచారు. దీని వల్ల రెండేళ్లలోనే భారత్ దివాళా అంచు నుంచి మెరుగైన విదేశీ మారక నిల్వలు కలిగిన దేశంగా మారింది. పీవీ నరసింహరావు హయాంతో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసి ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు.
అయితే, ఇలాంటి వ్యక్తి తన జీవితంలో అత్యుత్తమ క్షణం, అతిపెద్ద విచారం ఉన్నాయని చెప్పారు. జనవరి 3, 2014న ప్రధానమంత్రిగా తన చివరి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో డాక్టర్ సింగ్‌ను ప్రధానమంత్రిగా ఈ రెండింటి గురించి చెప్పారు. ‘‘ సామాజిక, ఆర్థిక మార్పుల ప్రక్రియను అణిచివేసేందుకు ప్రయత్నించిన అణు వర్ణవివక్షను అంతం చేయడానికి అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని తన కెరీర్‌లో ‘‘అత్యుత్తమ క్షణం’’. మనదేశం అనేక విధాలుగా సాంకేతిక అభివృద్ధి చెందుతోంది’’ అని ఆయన చెప్పారు.
Read Also: Bhatti Vikramarka: మన్మోహన్ సింగ్ మృతి దేశానికే కాదు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు..
అణుశక్తి, సాంకేతిక పరిజ్ఞానాన్ని శాంతియుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ అయిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA), ఆగస్టు 2008లో భారతదేశంతో భద్రతా ఒప్పందాన్ని ఆమోదించింది. దీని తర్వాత అమెరికా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(ఎన్ఎస్‌జీ)ని సంప్రదించి, భారత్‌కి పౌర అవసరాల కోసం టెక్నాలజీని బదిలీ చేయడానికి మినహాయింపు ఇచ్చింది.NSG సెప్టెంబరు 6, 2008న భారతదేశానికి మినహాయింపును మంజూరు చేసింది.
మన్మోహన్ సింగ్ తన పాలనలో ‘‘అతిపెద్ద విచారం’’గా ఆరోగ్య సంరక్షణ రంగమని చెప్పారు. ఈ రంగంలో తాను అనుకున్నంతగా పనిచేయలేదని వెల్లడించారు. “నన్ను క్షమించండి. నేను ఈ విషయం గురించి ఆలోచించలేదు. కానీ ఖచ్చితంగా, నేను ఆరోగ్య సంరక్షణ, పిల్లలకు ఆరోగ్య సంరక్షణ, మహిళలకు ఆరోగ్య సంరక్షణలో చాలా ఎక్కువ చేయాలనుకుంటున్నాను. మేము ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఆకట్టుకునే ఫలితాలను సాధించింది, అయితే ఇంకా చాలా చేయాల్సి ఉంది’’ అని చెప్పారు.