Site icon NTV Telugu

Manipur Landslide: 20కి చేరిన మృతుల సంఖ్య..44 మంది మిస్సింగ్

Manipur Incident

Manipur Incident

మణిపూర్ నోనీ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం రాత్రి నోని జిల్లాలోని టెరిటోరియల్ ఆర్మీ క్యాంప్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో జవాన్లతో పాటు ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. శనివారానికి మరణించిన వారి సంఖ్య 20కి చేరింది. మృతుల్లో 15 మంది జవాన్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆర్మీకి చెందిన 13 మంది సిబ్బందిని ఐదుగురు ప్రజలను రెస్క్యూ చేశారు. మరో 44 మంది కనిపించకుండా పోయారు. వీరంతా మట్టి కింద చిక్కుకునే ఉన్నారు.

తూపుల్ యార్డ్ రైల్వే నిర్మాణ ప్రాంతానికి సమీపంలో టెరిటోరియల్ ఆర్మీ క్యాంప్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. రైల్వే ప్రాజెక్ట్ భద్రత కోసం ఆ ప్రాంతంలో ఆర్మీ క్యాంప్ ఏర్పాటు చేశారు. రైల్వే నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీలు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుపోయారు. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ చర్యలను కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

వర్షాలు, వాతావరణ కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ శుక్రవారం ప్రమాదస్థలిని సందర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, గాయపడన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై బెంగాల్ కు చెందిన తొమ్మిది మంది జవాన్లు మరణించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రాష్ట్ర చరిత్రలోనే దారుణమైన సంఘటనగా ఈ ప్రమాదాన్ని అభివర్ణించారు సీఎం బీరేన్ సింగ్. మట్టి కారణంగా మృతదేహాలను వెలికి తీయడానికి 2-3 రోజులు పడుతుందని ఆయన అన్నారు. వర్షాల కారణంగా నేలంతా బురదమయంగా మారడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. రెస్క్యూ కోసం కేంద్ర ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బందిని పంపిందని ఆయన వెల్లడించారు.

 

Exit mobile version