Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్‌ది నీచ రాజకీయం’’.. విజయ్‌తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..

Congress

Congress

Mani Shankar Aiyar: తమిళనాడు రాజకీయ పరిణామాలపై, విజయ్‌కు చెందిన టీవీకే పార్టీకి సపోర్ట్ చేయడంపై కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ సొంత పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది నీచ రాజకీయ అవకాశవాదంగా కనిపిస్తోంది’’ అని అన్నారు. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమిళనాడులోకి మతతత్వ బీజేపీకి దొడ్డిదారిన ప్రవేశానికి వీలు కల్పిస్తే, అది రాజకీయ చరిత్రలోనే అత్యంత ఘోరమైన తప్పిదంగా మారుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతుందని దాని వ్యవస్థాపకులు కనీసం ఊహించలేరు అని అయ్యర్ అన్నారు.

Read Also: Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి, ఇద్దరు డిప్యూటీలు..?

డీఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన వెంటనే పక్షం మారి అదే టీవీకేతో చేతులు కలపడం కాంగ్రెస్‌కు చాలా దారుణమైన నిర్ణయమని విమర్శించారు. ఎన్నికల్లో టీవీకే కాంగ్రెస్‌ను 23 స్థానాల్లో ఓడించిందని, కేవలం 5 స్థానాలను మాత్రమే గెలుచుకున్నామని అయ్యర్ గుర్తు చేశారు. ‘స్వరాజ్యం అనేది నైతికతపై ఆధారపడిన ప్రభుత్వంగా ఉండాలి’ అనే మహాత్మా గాంధీ 1925 నాటి సూత్రాన్ని ఇది క్షమించరాని విధంగా ఉల్లంఘించడమేనని అయ్యర్ ఇంకా అన్నారు. తమిళనాడులో కాంగ్రెస్ తన మిత్రపక్షాన్ని విడిచిపెట్టడం చాణక్యుడి విజయమా.? లేక మహాత్మా గాంధీ విజయమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలుచుకున్న 5 సీట్లు సొంత బలంతో కాదని, డీఎంకే పొత్తు వల్లే గెలిచామని అన్నారు. విజయ్ ఒక లౌకికవాది, ద్రావిడవాది అయినప్పటికీ, ఎంతో కాలంగా తమతో ఉన్న డీఎంకే వంటి మిత్రుడిని విడిచిపెట్టడం చౌకబారు రాజకీయ అవకాశవాదం అని దుయ్యబట్టారు. ఇది గాంధీజీ కాంగ్రెస్ అనుసరించిన రాజకీయాలు కావని అన్నారు.

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే మెజారిటీకి మరో 10 స్థానాలు దూరంగా ఉండటంతో కాంగ్రెస్‌ ఐదుగురు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా డీఎంకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ అధికారం కోసం మిత్రుడిని మార్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఎంకే దీనిని వెన్నుపోటుగా అభివర్ణించింది. ప్రస్తుతం, విజయ్ టీవీకే కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీ ఎమ్మెల్యేల సపోర్టుతో అధికారం ఏర్పాటు చేయబోతున్నారు.