NTV Telugu Site icon

Divorce case: భార్య మాటల్ని గుట్టుగా రికార్డ్ చేసిన వ్యక్తి.. సుప్రీంకోర్టులో కీలక చర్చ..

Supreme Court

Supreme Court

Divorce case: భార్యభర్తల మధ్య విడాకుల కేసు సుప్రీంకోర్టు కీలక చర్చకు దారి తీసింది. ఈ కేసు ఆర్టికల్ 21 ద్వారా సంక్రమించే ‘‘గోప్యత హక్కు’’, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌పై ప్రశ్నల్ని లేవనెత్తింది. విడాకులు పిటిషన్ విచారిస్తున్న సుప్రీంకోర్టు, ఒక వ్యక్తి తన భార్య ప్రైవేట్ సంభాషణల్ని గుట్టుచప్పుడు కాకుండా కొన్ని ఏళ్లుగా రికార్డ్ చేసి, వాటిని కోర్టులో సాక్ష్యం కింద సమర్పించాడు. దీనిని సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. సదరు భర్త తన భార్యతో జరిగిన ప్రైవేట్ మాటల్ని మొబైల్ యాప్ ద్వారా రికార్డ్ చేసినట్లు సమచారం. ఈ రికార్డులను విడాకుల కేసులో సాక్ష్యంగా సమర్పించారు. ఇక్కడ ఇదే వాటి చట్టబద్ధత, నైతిక చిక్కులపై చర్చకు దారి తీసింది.

Read Also: Haj yatra: ముస్లింలకు గుడ్ న్యూస్.. ఇండియా-సౌదీల మధ్య ‘‘హజ్ అగ్రిమెంట్’’

ఈ కేసు విచారణ సందర్భంగా.. జస్టిన్ నాగరత్న, ‘‘ ఇన్ని సంవత్సరాలుగా భార్య మాటల్ని రికార్డ్ చేసే భర్త ఎవరుంటారు..?’’ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద గోప్యతా హక్కుకు, భారత సాక్ష్య చట్టంలోని నిబంధనలకు మధ్య పరస్పర చర్య గురించి ఈ కేసు ప్రశ్నలను లేవనెత్తుతుంది. భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలను రక్షించేందుకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ యొక్క సెక్షన్ 122 వర్తిస్తుందా అనే అంశాన్ని కోర్టు పరిశీలించనుంది. ఈ సెక్షన్ ప్రకారం, భర్త లేదా భార్య తాము కలసి పంచుకున్న వ్యక్తిగత సంభాషణల గురించి కోర్టులో వెల్లడించరాదు. ఈ సెక్షన్ ప్రకారం, భార్యాభర్తల మధ్య సంభాషణలు ప్రత్యేక సంబంధాన్ని సూచిస్తాయి. అవి వ్యక్తిగతమైనవి మరియు గోప్యంగా ఉండాల్సినవి. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చట్టపరమైన వివాదాలు ఉంటే, ఈ సంభాషణలను సాక్ష్యంగా కోర్టులో సమర్పించవచ్చు.

డిజిటల్ యుగానికి ముందు అమలులోకి వచ్చిన ఈ నిబంధనకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వెలుగులో కొత్త వివరణ అవసరమని సీనియర్ న్యాయవాది వృందా గ్రోవర్ అన్నారు. జస్టిస్ నాగరత్న, ‘‘ ఒక సెక్షన్ వివరణ ద్వారా అది పనికిరానిదిగా చేయలేము. పిటిషన్ వివాహిత జంట మధ్య ఉన్నప్పుడు ఈ నిబంధనలు మినహాయింపు సృష్టిస్తుంది’’ అని చెప్పారు. సమ్మతి లేకుండా ఒకరి మాటల్ని రికార్డ్ చేయడం ఆమోదయోగ్యం కాదని గతంలో ఒక హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, అనేక హైకోర్టు తీర్పులు సెక్షన్ 122 కింద చట్టబద్ధమైన మినహాయింపులను పట్టించుకోకుండా గోప్యతా సమస్యలపై మాత్రమే దృష్టి సారించాయని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ఈ విషయంపై ఫిబ్రవరి 18న తదుపరి విచారణకు రానుంది.