Site icon NTV Telugu

Supreme Court: నా భార్య ఆడది కాదు.. కోర్టులో భర్త పిటిషన్

తాను వివాహం చేసుకున్న మహిళ ఆడది కాదంటూ ఓ భర్త సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మెడికల్‌ రిపోర్టు ప్రకారం ఆమె ఆడది కాదని, తాను మోసపోయానని, ఆమె నుండి విడాకులు ఇప్పించాలంటూ పిటిషన్ ద్వారా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. 2016లో తమకు వివాహం అయిందని, ఆమె రుతుక్రమం కారణంగా తనకు దూరంగా ఉందని, అనంతరం ఆమె తన వద్దకు తిరిగి వచ్చిందని పిటిషన్‌లో భర్త పేర్కొన్నాడు.

ఆమెతో సన్నిహితంగా మెలిగే సమయంలో తనకు దూరంగా ఉండటంతో అనుమానం వచ్చిందని.. దీంతో ఆమెను వైద్యుని వద్దకు తీసుకెళ్లగా ఇంపర్‌ఫోరెట్‌ హైమన్‌ (చిన్నపాటి పురుషాంగం) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని సదరు వ్యక్తి పిటిషన్‌లో కోర్టుకు నివేదించాడు. ఆ పురుషాంగాన్ని ఆపరేషన్‌లో తొలగించవచ్చునని, అయితే దాదాపు పిల్లలు పుట్టరని వైద్యులు నిర్ధారించినట్లు తెలిపాడు. దీంతో ఆమె తండ్రికి ఫోన్ చేసి కుమార్తెను తిరిగి తీసుకెళ్లాలని చెప్పానని.. అయితే తన కుమార్తెతో కాపురం చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా మామ బెదిరించినట్లు ఆరోపించాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసి విడాకులు కోరుతూ మధ్యప్రదేశ్ కోర్టును ఆశ్రయించినట్లు వివరించాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. కేవలం మౌఖిక సాక్ష్యం ఆధారంగా.. మెడికల్‌ సాక్ష్యం లేకుండా చీటింగ్‌ చేశారని చెప్పడం సాధ్యపడదంటూ అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. ఆమెలో మహిళలకు ఉండాల్సిన లక్షణాలు, అవయవాలు అన్నీ ఉన్నందున ఇందులో మోసమేమీ లేదని కోర్టు అభిప్రాయపడింది.

దీంతో బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఐపీసీ ప్రకారం భార్య పురుషుడిగా మారినందుకుగానూ ఆమెపై సెక్షన్ 420 కింద క్రిమినల్ నేరం చేసినట్లు పరిగణించాలని భర్త తరఫు లాయర్ ఎన్‌కె మోదీ ధర్మాసనానికి తెలియజేశారు. ఆమె మహిళ కాదు కాబట్టి బాధితుడికి కచ్చితంగా అన్యాయం జరిగిందన్నారు. ఇది పుట్టుకతో వచ్చే సమస్య కాదని, ఆమెకు తన జననాంగాల గురించి తెలిసి తన క్లయింట్‌ను ఉద్దేశపూర్వకంగా మోసం చేసినట్లు కోర్టుకు విన్నవించారు. అయితే ఈ కేసుపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని భార్య, ఆమె తండ్రి, మధ్యప్రదేశ్ పోలీసులకు సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

https://ntvtelugu.com/snake-bite-one-family-till-six-times-in-chittoor-district/
Exit mobile version