Man Gives Triple Talaq To 4th Wife: కేంద్ర ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ముస్లిం మహిళల హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే కొంతమంది మాత్రం చట్టాన్ని ధిక్కరించి తమ భార్యలకు ట్రిపుల్ తలాక్ పేరుతో విడాకులు ఇస్తున్నారు. ఇలాంటివి దేశంలో చాలా సంఘటనలు జరిగాయి. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అయితే ఇప్పుడు ఆ భార్య న్యాయం కోసం పోరాడుతోంది.
Read Also: Gujarat: కోట్లకు వారసురాలు.. అయినా 8 ఏళ్లకే సన్యాసం స్వీకరించింది..
వివరాల్లోకి వెళితే తన నాలుగో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు రాజస్థాన్ కు చెందిన 32ఏళ్ల ఇమ్రాన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు మధ్యప్రదేశ్ ఇండోరో పోలీసులు వెల్లడించారు. ఇద్దరు మాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకున్నారు. ఇమ్రాన్ కు అప్పటికే ముగ్గురు భార్యలు ఉన్నారని నాలుగో భార్య తెలుసుకుంది. దీంతో ఇద్దరి మధ్య వివాదం ఏర్పడింది. దీంతో రాజస్థాన్ లో ఉన్న ఇమ్రాన్ నాలుగో భార్యకు ‘‘ తలాక్, తలాక్, తలాక్’’ అంటూ టెక్ట్స్ మెసేజ్ పంపి వివాహాన్ని రద్దు చేసుకున్నాడు.
ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం తక్షణ ‘ట్రిపుల్ తలాక్’ ఆచారాన్ని నిషేధిస్తుంది. దీనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తుంది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఇమ్రాన్ పై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు వెల్లడించారు.
