రాజస్థాన్‌లో ఘోర అమానుష ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయేది. పోలీసుల అప్రమత్తతతో యువకుడి ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన జుంజును జిల్లాలో చోటుచేసుకుంది.
రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో 25 ఏళ్ల చెవిటి, మూగ యువకుడు రోహితాష్ కుమార్ అనాథగా ఉంటున్నాడు. కుటుంబం లేకపోవడంతో ఒక షెల్టర్ హోమ్‌లో నివాసం ఉంటున్నాడు. అతడి ఆరోగ్యం బాగోలేకపోతే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడి పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చి చికిత్స అందించారు. అయితే గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రోహితాష్ కుమార్ చనిపోయినట్లుగా వైద్యులు నిర్థారించారు. అనంతరం పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని ఖననం చేసేందుకు పోలీసులు స్మశానానికి తీసుకెళ్లారు. చితిపై మృతదేహాన్ని పెట్టి తగలబెడుతుండగా హఠాత్తుగా కుమార్ శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు. మంటల్లోంచి కుమార్ లేచి కూర్చున్నాడు. వెంటనే పోలీసులు స్పందించి కుమార్‌ను అంబులెన్స్‌లో తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. రెవెన్యూ అధికారి మహేంద్ర ముండ్, సామాజిక న్యాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పవన్ పూనియా కూడా ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.
అయితే ఈ ఘటనపై జుంజును జిల్లా కలెక్టర్ రమనతార్ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల తీరును తీవ్రంగా ఖండించారు. చనిపోయినట్లు నిర్ధారించిన డాక్టర్ యోగేష్ జాఖర్, డాక్టర్ నవనీత్ మీల్, డాక్టర్ సందీప్ పచార్‌లను గురువారం రాత్రి సస్పెండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఘటనపై వైద్య శాఖ కార్యదర్శికి సమాచారం అందించినట్లు కలెక్టర్ మీనా తెలిపారు.