NTV Telugu Site icon

Chhaava: మమతా బెనర్జీ ‘‘ఛావా’’ సినిమా చూడాలి.. యూపీ డిప్యూటీ సీఎం..

Chhaava

Chhaava

Chhaava: ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, తన సహచరులతో కలిసి బాలీవుడ్ సినిమా ‘‘ఛావా’’ చూశారు. మరాఠా ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఔరంగజేబు, మరాఠాల మధ్య ఘర్షణలను సినిమాలో చూపించారు. ఇదిలా ఉంటే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఛావా సినిమాను చూడాలని మౌర్య కోరారు. దీని ద్వారా ఔరంగజేబు క్రూరత్వం ఆమెకు తెలుస్తుందని ఆయన అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ ఛావా గురించి చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించాలని అన్నారు. మతాన్ని మార్చడానికి బలప్రయోగం చేసిన వ్యక్తి గురించి మాట్లాడే వారి గురించి ఆయన మౌనం వీడాలని చెప్పారు.

Read Also: Court Movie : కోర్టు మూవీ మొదటి వారం కలెక్షన్లు ఎంతంటే..?

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఛావా సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్య వసూళ్లు సాధిస్తోంది. శంభాజీ ధీరత్వం, ఔరంగజేబు మోసాల గురించి సినిమాలో చెప్పారు. శంభాజీని హింసించి చంపడం, ముఖ్యంగా మహారాష్ట్రలో భావోద్వేగానికి కారణమైంది. ఈ సినిమా తర్వాత శంభాజీ నగర్( ఔరంగాబాద్)లో ఉన్న ఔరంగజేబు మసీదును తొలగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ డిమాండ్ల నేపథ్యంలో, ఇటీవల నాగ్‌పూర్‌లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

అంతకుముందు గురువారం, సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. నాగ్‌పూర్ హింసను ఖండిస్తున్నట్లు చెప్పారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధి అని అన్నారు. “నేను దీనిపై వ్యాఖ్యానించదలచుకోలేదు. కానీ మేము ఈ హింసను ఖండిస్తున్నాము. మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధి చెందింది. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత, మత సామరస్యాన్ని కాపాడటానికి నేను వీధుల్లోకి వచ్చాను. నాగ్‌పూర్ పరిస్థితిపై నేను ఎటువంటి వ్యాఖ్య చేయాలనుకోవడం లేదు” అని చెప్పారు.