NTV Telugu Site icon

Bengal Governor: “నిందితుడిని ఉరితీసి, తర్వాత విచారించాలా.?” మమతా బెనర్జీపై గవర్నర్ ఫైర్..

Bengal Governor

Bengal Governor

Bengal Governor: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో 31 ఏళ్ల పీజీ వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై అఘాయిత్యం జరిగింది. ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ, సీపీఎం పార్టీలు ఫైర్ అవుతున్నాయి. ఈ ఘటన వెనక తృణమూల్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారంటూ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది.

ఇదిలా ఉంటే, బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సీఎం మమతా బెనర్జీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. ఆమె ‘‘డాక్టర్ జెకిల్ అండ్ హైడ్’’లాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో పూర్తిగా పోలీసులు వైఫల్యం చెందారని ఆరోపించారు. ‘‘ముఖ్యమంత్రి నిందితుడిని ఉరితీసి, ఆపై విచారణని కొనసాగించండి అని చెప్పడం రోమన్ చక్రవర్తి మాట్లాడినట్లు ఉంది’’ అని అన్నారు.

Read Also: Mamata Banerjee: కోల్‌కతా హాస్పిటల్ దాడి బీజేపీ, లెఫ్ట్ పార్టీల పనే..

‘‘కేజీ కార్‌ ఆస్పత్రిలో జరిగిన ఘటన తర్వాత నేను ఇప్పటికే ముఖ్యమంత్రికి సుదీర్ఘ లేఖ రాశాను, అందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించానని, రాజ్యాంగంలోని 167వ అధికరణం కింద ఆమె నుంచి నివేదిక ఇవ్వాలని డిమాండ్‌ చేశాను. గత ఐదేళ్లలో నేను ఇలాంటి 30 లేఖలు పంపాను, వాటికి సమాధానాలు ఇవ్వలేదు, ఇది రాజ్యాంగ విరుద్ధం.’’ అని అన్నారు. రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా చూసుకునేంత బలంగా ఉంది, నేను పరిస్థితిని చూస్తున్నాను మరియు బాగా ఆలోచించి భారత ప్రభుత్వానికి నివేదిక పంపుతానని అన్నారు.

వైద్యురాలి ఘటనపై మాట్లాడుతూ.. ఈ విషయం ఇప్పటికే హైకోర్టు పరిధిలో ఉందని, బాధితురాలికి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కేసులో పోలీసులు ఖచ్చితంగా వైఫల్యం చెందారని నేను అనుకుంటున్నానని, పోలీసులు ఎవరో దొంగలు ఎవరో అని ప్రజలు చూస్తున్నారని అన్నారు. ఈ కేసులో ఆర్జీ కర్ ఆస్పత్రి ‘‘కుంభకోణాల పాఠశాల’’గా మారిందని దుయ్యబట్టారు. మనం చూస్తున్నది కొంత అవినీతినే అని అన్నారు.

Show comments