Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ఒక మహిళ దాడికి యత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. కోల్‌కతాలో దుర్గా పూజా పండల్ ప్రారంభిస్తున్న సమయంలో ఒక మహిళ దాడికి యత్నించిందని ఆరోపిస్తున్నారు. సదరు మహిళ మమత చీర లాగిందని, ఆమె వద్ద నుంచి ఒక కత్తి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత తమ నేత భద్రతపై టీఎంసీ కార్యకర్తలు, నేతలు ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు.
మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాడి సమయంలో ఒక మహిళ మమతా బెనర్జీ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి, అత్త అని పిలిచిందని, తర్వాత దాడికి ప్రయత్నించిందనే ఆరోపణలు ఉన్నాయి. సదరు మహిళ మత్తు పదార్థాల ప్రభావంలో ఉందని, ఆమె చేతిలో కత్తి ఉందని రాజ్యసభ ఎంపీ డోలా సేన్ ఆరోపించినట్లు తెలుస్తోంది. సదరు మహిళ తాను మమతా బెనర్జీ మేనకోడలని చెప్పుకుంటూ జన సమూహంలోకి చేరిందనే ఆరోపణలు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం తర్వాత నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలపై ప్రజల దాడులు ఎక్కువయ్యాయి. చాలా మంది నేతలపై కోడిగుడ్లు, టొమాటోలతో దాడికి పాల్పడుతున్నారు. గతంలో అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. టీఎంసీ నేత కునాల్ ఘోష్‌పై కూడా కోడిగుడ్లతో దాడి చేశారు. టీఎంసీ నేతలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.

