Site icon NTV Telugu

Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడిగా రేపు బాధ్యతలు చేపట్టనున్న ఖర్గే

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mallikarjun Kharge To Sworn Oath As AICC President On October 26: ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మల్లికార్జున్ ఖర్గే.. రేపు ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఏఐసీసీ ప్రాంగణంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రేపు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రస్తుత – మాజీ సీడబ్ల్యూసీ సభ్యులు, ప్రస్తుత – మాజీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, ప్రస్తుత – మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత – మాజీ పీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత – మాజీ సీఎల్‌పీ లీడర్లు హాజరు కానున్నారు.

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల నిర్వహణలో కీలక భాగస్వాములైన ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్ల( పిఆర్ఓ)లతో పాటు అసిస్టెంట్ ఏపీఆర్ఓలు కూడా ఈ సమావేశానికి ఆహ్వానం అందుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ చేసిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ఈ సమావేశం ఆమోదించనుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు.. ఏఐసీసీ సెంట్రల్ ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ, మల్లికార్జున్ ఖర్గేకు సర్టిఫికెట్‌ను అందజేయనున్నారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో ఖర్గే తొలిసారిగా తొలిసారిగా పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నేతలు వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. అయితే.. అనారోగ్య రీత్యా మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశం ఉంది.

కాగా.. ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్ పోటీ పడిన సంగతి తెలిసిందే! అక్టోబరు 17వ తేదీన ఎన్నికలు నిర్వహించగా.. బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 9500 ఓట్లు పోలవ్వగా.. ఖర్గేకు 7,897 ఓట్లు, థరూర్‌కు 1072 ఓట్లు పడ్డాయి. మరో 416 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. గాంధీ కుటుంబంతో పాటు సీనియర్లందరూ ఖర్గేకు మద్దతుగా ఉండటంతో.. ఆయన భారీ మెజారిటీ దక్కింది.

Exit mobile version