Mahua Moitra: వచ్చే వారం నేను సమావేశం నిర్వహిస్తా! కంగనా రనౌత్‌ వీడియో పోస్ట్ చేసిన మహువా మొయిత్రా

  • వచ్చే వారం నేను సమావేశం నిర్వహిస్తా!
  • కంగనా రనౌత్‌ వీడియో పోస్ట్ చేసిన మహువా మొయిత్రా
  • ఇటీవల అధికారులపై మండిపడ్డ కంగనా
Mahua Moitra

Mahua Moitra

ఇటీవల బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ మండి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిధులు ఖర్చు చేయని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఖర్చు చేయలేదని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది.

తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా.. కంగనా రనౌత్‌పై పరోక్షంగా సెటైర్ వేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, MPLADS నిధుల వినియోగంపై అధికారులతో వచ్చే వారం తాను కూడా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నానని చెబుతూ.. కంగనా అధికారులను నిలదీస్తున్న వీడియోను షేర్ చేశారు. దీంతో పరోక్షంగా కంగనా తీరును తప్పుపట్టినట్లుగా కనిపిస్తోంది. ఇద్దరు ఎంపీల మధ్య పరోక్ష యుద్ధం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

మహువా మొయిత్రా సోమవారం ఎక్స్‌లో నదియా జిల్లా యంత్రాంగాన్ని ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. కృష్ణానగర్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ అయిన ఆమె.. చాప్రా బస్‌స్టాండ్, పట్టబుకా ఆడిటోరియం సహా పలు అభివృద్ధి పనుల పురోగతిపై వచ్చే వారం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

మహువా మొయిత్రా షేర్ చేసిన వీడియోలో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాకు చెందిన అధికారులతో కంగనా రనౌత్ సమావేశమైన దృశ్యాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ప్రజాధన వినియోగంపై ఆమె అధికారులను ప్రశ్నించారు. తన నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉండటంపై కంగనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్లుగా పరిష్కారం కాని సమస్యలపై ఇంకా చర్చలు జరపడం వల్ల ప్రయోజనం లేదని, వెంటనే పనులు పూర్తి చేసి తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

రూ.11 కోట్ల నిధులపై కంగనా ప్రశ్నలు

తన నియోజకవర్గానికి రూ.11 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ ఒక్క పని కూడా చేపట్టలేదని కంగనా ఆరోపించారు. అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పరిస్థితిని “అసమర్థత”, “దయనీయమైన నిర్వహణ”గా అభివర్ణించారు. అధికార యంత్రాంగం పనితీరుపై జాతీయ మీడియా ముందు తాను ఏం సమాధానం చెప్పాలని కంగనా ప్రశ్నించారు. తాజాగా కంగనా అధికారులను నిలదీస్తున్న వీడియోను మహువా మొయిత్రా షేర్ చేయడంతో.. ఇద్దరు ఎంపీల మధ్య రాజకీయంగా పరోక్ష విమర్శలు, సెటైర్లు చర్చనీయాంశంగా మారాయి.