NTV Telugu Site icon

Sayaji Shinde: రాజకీయాల్లోకి నటుడు సాయాజీ షిండే.. ఆ పార్టీలో చేరిక..

Sayaji Shinde

Sayaji Shinde

Sayaji Shinde: ప్రముఖ నటుడు సాయాజీ షిండే రాజకీయ పార్టీలో చేరారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అజిత్ పవార్‌కి చెందిన ఎన్సీపీ పార్టీలో శుక్రవారం చేరారు. అజిత్ పవార్ స్వయంగా సాయాజీ షిండేని పార్టీలోకి స్వాగతించారు. ఎన్సీపీలో చేరిన తర్వాత సాయాజీ షిండే మాట్లాడుతూ.. తాను చాలా కాలంగా సేవ చేస్తున్నానని, తన సేవల్ని కొనసాగిస్తున్నానని అన్నారు. అజిత్ పవార్‌ని ప్రశంసిస్తూ.. ఆయన పార్టీ విధానాలు ఆకర్షణీయంగా ఉన్నాయని, అందుకే ఎన్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

Read Also: Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గంలో అధికారులు క్షేత్ర స్థాయిలో పని చేయాలి.. ఆదేశం

‘‘సినిమాల్లో రాజకీయ నాయకుల పాత్రల్ని చేశాను కానీ.. ఇంకా రాజకీయ నాయకుడిగా మారలేదు. నేను చేసే సామాజిక సేవా కార్యక్రమాలను బయట ఉంచకుండా వ్యవస్థలోకి వచ్చి ఏదైనా మంచి పని చేస్తే బాగుంటుందని భావించాను. అందుకే నేను అజిత్ పవార్ యొక్క ఎన్‌సిపి విధానాలను ఇష్టపడి, ఆయన పార్టీలో చేరాను. లాడ్లీ బెహన్ యోజన పేద మహిళల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. నాకు రాజకీయాల్లో ఎలాంటి స్వార్థం లేదు’’ అని సాయాజీ షిండే అన్నారు. ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బల్ మాట్లాడుతూ.. షిండే అద్భుతమైన నటుడే కాదు, అద్భుతమైన వ్యక్తి, రాజకీయ నాయకుడిగా మారారని అన్నారు. రాజకీయాల్లో షిండేకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. షిండే మాతృభాష మరాఠీతో పాటు తెలుగు, హిందీ సినిమాల్లో నటించారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌తో కలిసి ముచ్చటించిన వీడియో వైరల్ అయింది. పోకిరి, ఠాగూర్, గుడుంబా శంకర్, చిరుత, కిక్, అరుంధతి, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాల్లో నటించారు.

Show comments