NTV Telugu Site icon

Maharashtra Political Crisis: బలపరీక్షకు వెళ్లే ఆలోచనలో శివసేన

Maharashtra

Maharashtra

మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శివసేన పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారుతున్నారు. శివసేన తిరుగుబాటు నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో 35 మంది శివసేన ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు శివసేన పార్టీలో చీలిక తెచ్చారు. దీంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అయితే ఏక్ నాథ్ షిండే మాత్రం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు శివసేనకు అండగా నిలుస్తామని ప్రకటించాయి. తాజాగా శివసేన బల పరీక్షకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెబెల్ ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయమని పిటిషన్ వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రస్తుతం పరిస్థితిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మైనారిటీలో పడలేదని ఆయన అన్నారు. ఎంవీఏ ప్రభుత్వ బలం ఫ్లోర్ టెస్ట్ లో తేలుతుందని శరద్ పవార్ అన్నారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు శాసన సభకు రావాల్సి ఉంటుందని.. సూరత్, గౌహతిలో కూర్చొని ఏదైనా మాట్లాడవచ్చని.. ఒక్కసారి ఇక్కడకు వస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలందరిని గుజరాత్, తర్వాత అస్సాంకు ఎలా తీసుకెళ్లారో అందరికీ తెలిసిందే అని.. వారికి సహాయం చేస్తున్నవారి పేర్లను వెల్లడించనని.. అస్సాం ప్రభుత్వం వారికి సహాయం చేస్తుందని పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు.

మరోవైపు గౌహతి క్యాంపులో ఉన్న శివసేన ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  బీజేపీ జాతీయ పార్టీ అని.. మేము తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఎమ్మెల్యేలు హాజరవుతామని బీజేపీ చెప్పిందని, రెబెల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యానించారు.

 

 

Show comments