మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు వర్గం, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా గౌహతి నుంచి శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి గుజరాత్ వడోదర వేదిక అయినట్లు వార్తలు వినిపిస్తున్నారు. ఇద్దరు నేతలు కూడా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాట్ల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్థరాత్రి ఈ భేటీ జరిగినట్లు సంబంధిత వర్గాల నుంచి సమాచారం.
గౌహతి నుంచి స్పెషల్ విమానం ద్వారా వడోదల చేరుకున్న ఏక్ నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశం అయ్యారని.. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఏక్ నాథ్ షిండే గౌహతి వెళ్లారని తెలుస్తోంది.
ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని శివసేన తిరుగుబాటు నేత షిండే వర్గం వ్యతిరేకిస్తోంది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే శివసేనకు చెందిన 56 మంది ఎమ్మెల్యేలలో షిండే వర్గంలో 38 మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొంత మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇదిలా ఉంటే మహా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత నోటీసులు ఇచ్చారు. సోమవారం సాయంత్రంలోగా స్పందించాలని కోరారు. మరోవైపు షిండే రెబెల్ వర్గం శివసేన కానీ, బాల్ ఠాక్రే పేరును కానీ వాడుకోకుండా ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీలో తీర్మాణం చేశారు.