NTV Telugu Site icon

Eknath Shinde: టెంపో డ్రైవర్ నుంచి సీఎంగా ఎదిగాడు.. షిండే ప్రస్థానం..

Eknath Shinde Political Career

Eknath Shinde Political Career

మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏక్‌నాథ్‌ షిండే. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై అసంతృప్తితో తిరుగుబాటు చేసి తిరుగులేని నేతగా ఎదిగారు. ఎంవీఏ సర్కారు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న మంత్రి, ఊహించని రీతిలో తిరుగుబాటు.. ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్‌కు పయనం.. అక్కడి నుంచి అస్సాంకు వెళ్లడం.. ఈ పరిణామాలతో మహా రాజకీయాలు ఉత్కంఠను రేకెత్తించాయి. సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్తును గందరగోళంలో పడేశాయి. పక్కా వ్యూహాలతో బీజేపీతో అనూహ్యంగా పొత్తు పెట్టుకుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఏక్‌నాథ్‌ షిండే. అసలు ఆయన నేపథ్యం ఏంటో తెలుసుకుందాం.

మరాఠా వర్గానికి చెందిన ఏక్‌నాథ్‌ షిండే స్వస్థలం సతారా. అనంతరం వీరి కుటుంబం ఠాణేలో స్థిరపడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్న తనంలోనే చదువుకు దూరమైన ఆయన.. కుటుంబానికి అండగా ఉండేందుకు చిన్న చిన్న పనులు చేసేవారు. రిక్షా, టెంపో డ్రైవర్‌గా కూడా పనిచేశారు. 1980ల్లో శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే స్ఫూర్తితో రాజకీయాల్లో చేరిన ఆయన క్రమక్రమంగా పార్టీలో కీలక నేతగా ఎదిగారు. థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. థానే జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాల్లో ముందుండేవారు. అలా శివసేన అధిష్ఠానం దృష్టిలో పడిన షిండే.. 2004లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.

Devendra Fadnavis: ఫడ్నవీస్ సీఎం పదవి ఎందుకు తీసుకోలేదంటే?

ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర శాసనసభకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరుసగా 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు. 2014లో గెలిచిన అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. తరువాత ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ఠాణే ప్రాంతంలో ప్రముఖ నేతల్లో ఒకరైన ఏక్‌నాథ్ షిండే.. ఆ ప్రాంతాల్లో శివసేనను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ నమ్మకం చొరగొన్న నేతగా గుర్తింపు పొందాడు. దేవేంద్ర ఫడ్నవీస్‌తో షిండేకు మంచి స్నేహం ఉంది. 2014లో ఫడ్నవీస్ ప్రభుత్వంలో షిండే కేబినెట్‌ మంత్రిగా కూడా పనిచేశారు.

2005లో థానే జిల్లా శివసేన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2014లో ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పనిచేశారు. 2019 నవంబర్‌ 28 నుంచి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ఆధ్వర్యంలో ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. శివ‌సేనపై అసంతృప్తితో ఇటీవల తిరుగుబాటు చేయడంతో జూన్ 21న శివసేన పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. అయినప్పటికీ 40 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉండగా.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూడీ సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

Show comments