Site icon NTV Telugu

Maharashtra: ‘రమ్మీ’ మంత్రి మాణిక్‌రావ్ కోకటే‌కు మళ్లీ ఇక్కట్లు.. పదవికి రాజీనామా

Maharashtra

Maharashtra

మూడు దశాబ్దాల నాటి కేసు మహారాష్ట్ర మంత్రి మెడకు చుట్టుకుంది. 1995 గృహనిర్మాణ కుంభకోణం కేసులో మంత్రి మాణిక్‌రావ్ కోకటే, ఆయన సోదరుడు విజయ్ కోకాటేను న్యాయస్థానం దోషులుగా తేల్చింది. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే మాణిక్‌రావ్ కోకటే.. మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్రలో రాజకీయ సంచలనంగా మారింది.

గృహనిర్మాణ పథకంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్దేశించిన 10 శాతం కోటాను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మంత్రి, ఆయన సోదరుడిని కోర్టు దోషులుగా తేల్చింది. నాసిక్ సెషన్స్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో మహాయుతి కూటమి ప్రభుత్వంలో అలజడి చెలరేగింది. ఎన్‌సీపీ నేత, మాణిక్‌రావ్ కోకటే రాజీనామా చేయక తప్పలేదు.

నాసిక్ సెషన్స్ కోర్టు గతంలో మెజిస్ట్రేట్ విధించిన శిక్షను సమర్థించింది. న్యాయస్థానం శిక్ష నిర్ధారించడంతో మాణిక్‌రావ్ కోకాటే మహారాష్ట్ర శాసనసభ నుంచి అనర్హతకు గురయ్యే అవకాశం ఉంది. ఎన్నికల చట్టం ప్రకారం.. రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం దోషిగా తేలితే ఉన్నత న్యాయస్థానం స్టే ఇవ్వకపోతే వెంటనే అనర్హతకు గురవుతారు.

కోకాటే రాజీనామా లేఖ ఇంకా ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌కు అందలేదని వర్గాలు తెలిపాయి. అయితే మంత్రిని రక్షించే ప్రయత్నం చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోకాటే రాజీనామాను ఫఢ్నవిస్ ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. అజిత్ పవార్‌తో కూడా ఫడ్నవిస్ ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం.

Exit mobile version