Breaking News: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ బారామతి నుంచి పోటీ చేస్తుండగా, ఆయనపై శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ పోటీకి దిగాడు. యుగేంద్ర పవార్ ఎన్సీపీ (శరద్ పవార్) వర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. గత లోక్‌సభ ఎన్నికల్లో బారామతి ఎంపీ సీటులో పోటీ కూడా సంచలనంగా మారింది. ఆ సమయంలో శరద్ పవార్ వర్గం నుంచి ఆయన కూతురు సుప్రియా సూలే పోటీ చేయగా, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేసింది. ఈ పోరులో సుప్రియా సూలే విజయం సాధించారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బారామతి అసెంబ్లీ స్థానం చర్చనీయాశంగా మారింది.
Read Also: Delhi: కేంద్రమంతి జయంత్ సింగ్ కుమార్తె నాట్య ప్రదర్శనపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన శరద్ పవార్ 1999లో ఎన్సీపీని స్థాపించారు. అయితే, గతేడాది జూలై నెలలో ఎన్సీపీ అజిత్, శరద్ పవార్ వర్గాలుగా విడిపోయింది. అజిత్ పవార్ బీజేపీ కూటమిలో చేరి, మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం అజిత్ పవార్ బీజేపీ, షిండే శివసేనతో మహాయుతి కూటమిలో ఉన్నారు. మరోవైపు శరద్ పవార్ వర్గం, ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్ మహా వికాస్ అఘాడీ కూటమిలో ఉంది. వచ్చే నెల 20న రాష్ట్రంలోని 288 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి.