మహారాష్ట్ర కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏక్ నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇవ్వబోతున్నారు. గతంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం వివాదాస్పద ముంబై మెట్రో కార్ షెడ్ ప్రాజెక్ట్ ను ఆరే కాలనీలో నిర్మించడాన్ని వ్యతిరేకించింది. దీన్ని కంజుర్‌మార్గ్ కు మార్చాలని నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఆరే కాలనీలోనే మెట్రోకార్ షెడ్ ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం.
2019లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం హాయాంలో అనుకున్న ప్రకారం ఆరే కాలనీలోనే మెట్రోకార్ షెడ్ నిర్మిస్తామని కోర్టుకు సమర్పించాలని అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోనిని సీఎం షిండే ఆదేశించినట్లు తెలిసింది. అప్పటి ఫడ్నవీస్ ప్రభుత్వం హయాంలో ఆరే కాలనీలో మెట్రోకార్ షెడ్ నిర్మాణానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అనుమతి కోరింది. దీనికి బీఎంసీ కూడా అనుమతి ఇచ్చింది.
Read Also:Maharashtra: జూలై 2,3 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు
అయితే ఇదే సమయంలో అక్కడ ఉన్న చెట్లను నరికివేతను వ్యతిరేకిస్తూ చాలా మంది పర్యావరణవేత్తలు, ప్రజలు భారీ నిరసనలు, ఆందోళనలు చేశారు. ఆ సమయంలో మెట్రో కార్ షెడ్ నిర్మిస్తున్న చోటును అటవీ భూమిగా, జీవవైవిద్య ప్రాంతంగా గుర్తించలేమని ఫడ్నవీస్ అన్నారు. 2019లో ఏర్పడిన శివసేన ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. మెట్రో కార్ షెడ్ ను కంజుర్ మార్గ్ కు మార్చింది. అయితే ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం బాంబే హైకోర్ట్ కు వెళ్లింది. మెట్రో కార్ షెడ్ నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతం కేంద్రానికి సంబంధించిన ఉక్కు శాఖకు చెందినదని పేర్కొంది. దీంతో దీనిపై హైకోర్ట్ స్టే విధించింది. అయితే తాజాగా షిండే ప్రభుత్వం, గతంలో ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా చర్యలు తీసుకోనుంది.
