Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర బీజేపీ- శివసేన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వ మంత్రి వర్గ కూర్పు ఖారైంది. ఇరు పక్షాలు చెరో 9 మంత్రి పదవులను పంచుకున్నాయి. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా 18 మందిని మంత్రి పదవులు వరించనున్నాయి. రెండు భాగస్వామ్య పార్టీల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావు లేకుండా ఇరు పక్షాలు చెరి సమానంగా మంత్రి పదవులు తీసుకున్నాయి. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ, శివసేన పార్టీ నుంచి 9 మంది చొప్పున ఎమ్మెల్యేలు మంత్రులుగా ఈ రోజు పదవీ స్వీకారం చేయనున్నారు.
శివసేన నేత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ప్రభుత్వం పడిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత ఏక్ నాథ్ షిండే సారథ్యంలో బీజేపీ, శివసేన ఏక్ నాథ్ షిండే వర్గంతో ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పడిపోయిన 40 రోజుల తర్వాత కేబినెట్ విస్తరణ జరిగింది. ప్రస్తుతం శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఏక్ నాథ్ షిండే వర్గంలో ఉన్నారు. మెజారిటీ ఎంపీలు కూడా ఏక్ నాథ్ షిండే వెంటే నడుస్తున్నారు.
Read Also: Black Magic: చనిపోయిన భర్త లేచొస్తాడు.. మంత్రగాడి మాయ
ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిఫ్యూటీ సీఎంగా ఉన్నారు. తాజాగా కేబినెట్ విస్తరణపై ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చాలా సార్లు మంతనాలు జరిగాయి. అమిత్ షా, జేపీ నడ్డాలతో షిండే, ఫడ్నవీస్ భేటీ అయ్యారు. తాజాగా మంత్రి వర్గవిస్తరణలో బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ ముంగంటివార్, గిరీష్ మహాజన్, సురేష్ ఖాడే, రాధా కృష్ణ విఖే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గావిట్,అతుల్ సేవ్ లకు మంత్రి పదవులు లభించాయి. ఇక ఏక్ నాథ్ షిండే శివసేన వర్గం నుంచి దాదా భూసే, సందీపన్ బుమ్రే, ఉదయ్ సమంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్, శంభురాజే దేశాయ్ లకు మంత్రి పదవులు దక్కాయి.
