NTV Telugu Site icon

Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు అంతా సిద్ధం..

Election Results

Election Results

Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల కోసం దేశం ఎదురుచూస్తోంది. ఈ రోజు ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. లోక్‌సభ, హర్యానా ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.  ఉదయం 11 గంటల వరకు ఎవరు గెలుస్తున్నారనే విషయంపై స్పష్టత రానుంది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు:

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 288 స్థానాల్లో 4138 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో 3239 మంది నిలువగా, ఈసారి సంఖ్య పెరిగింది. ఈ రాష్ట్రంలో రెండు కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ నేతృత్వంలోని ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీనీలు ‘‘మహాయుతి’’ కూటమిగా పోటీ చేశాయి. మరోవైపు ప్రతిపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమిలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలు ఉన్నాయి. మహారాష్ట్రలో అధికారం నిలుపుకోవాలని బీజేపీ కూటమి భావిస్తుంటే, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పునరావృతం చేయాలని ఎంవీఏ అనుకుంటోంది. ఓట్ జిహాద్, అభివృద్ధి నినాదాలతో పాటు యోగి ఆదిత్యనాథ్ ‘‘బాటేంగేతో కటేంగే’’, మోడీ ‘‘ఏక్ హైతో సేఫ్ హై’’ అనే నినాదాలు ప్రచారంలో ప్రముఖ పాత్ర పోషించాయి. మరోవైపు కాంగ్రెస్ కూటమి ‘‘కులగణన’’, రాజ్యాంగ పరిరక్షణ అనే అంశాలను తెరపైకి తెచ్చింది.

జార్ఖండ్ ఎన్నికలు:

జార్ఖండ్‌లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 43 స్థానాల్లో 683 మంది పోటీ చేశారు. రెండో విడుతలో 38 స్థానాలకు గానూ 528 మంది పోటీలో నిలబడ్డారు. మొత్తంగా 1211 మంది పోటీ చేశారు. బీజేపీ నేతృత్వంలో ఏజేఎస్‌యూ, జేడీయూ పార్టీలు ఎన్డీయే కూటమిగా పోటీ చేశాయి. మరోవైపు అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీ చేస్తున్నాయి. బంగ్లాదేశ్ చొరబాట్లు, ఆదివాసీ హక్కులపై ఎన్నికల ప్రచారం నడిచింది.