NTV Telugu Site icon

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో నిన్న ఒక్కరోజే 3.5 కోట్ల మంది భక్తులు!

Maha Kumbh

Maha Kumbh

Maha Kumbh Mela 2025: ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. నిన్న (జనవరి 14) మకర సంక్రాంతి పండగను పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్య స్నానాలు చేయగా.. తెల్లవారుజామునే 3 గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు స్టార్ట్ అయ్యాయి. ఒక్కరోజే సుమారు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

Read Also: BCCI: ఇకపై అలా ఆడకపోతే ఆటగాళ్ల పేమెంట్స్‌లో భారీగా కోత పడనుందా?

అయితే, కుంభమేళా సమయంలో అమృత్‌ స్నాన్‌కు ప్రత్యేకమైన స్థానముంది. దీంతో భారీ సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలి వచ్చి పుణ్య స్నానాలు చేశారు. వాళ్లు కేవలం కుంభమేళా సమయంలోనే వస్తుంటారు. ఈ క్రమంలోనే మంగళవారం నాడు ఒంటినిండా భస్మాన్ని పూసుకుని ఈటెలు, త్రిశూలాలు, డమరుక నాదాలను చేతిలో పట్టుకుని వేల మంది నాగ సాధువులు ఊరేగింపుగా పుణ్యస్నానాలకు బయలుదేరి వచ్చారు. మొదట పంచాయతీ అఖాడా మహానిర్వాణీ, శంభు పంచాయతీ అటల్‌ అఖాడాకు చెందిన సాధువులు అమృత్‌ స్నాన్‌లు చేయగా.. మరోవైపు, హెలికాప్టర్ల ద్వారా భక్తులపై యూపీ సర్కార్ పూల వర్షం కురిపించింది.

Read Also: Flexi Politics: ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, కేసీఆర్, బాలయ్య.. కొత్త రాజకీయ చర్చ..!

ఇక, మకర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించిన సాధువులు, భక్తులకు ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా అభినందనలు తెలిపారు. అలాగే, ఈ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. అయితే, మహా కుంభమేళా ఏర్పాట్లపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మండిపడ్డారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెప్తున్న మాటలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయన్నారు. తాగునీరు, ఆహారం, వసతి లాంటి కనీస సౌకర్యాల కోసం భక్తులు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.

Show comments