Site icon NTV Telugu

Maha Kumbh: ‘‘ అలసిపోయాం, ప్లీజ్ ఇక రాకండి’’.. భక్తులకు ప్రయాగ్‌రాజ్ ప్రజల విన్నపం..

Prayag Raj

Prayag Raj

Maha Kumbh: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అద్భుతంగా నిర్వహించింది. జనవరి 13 న ప్రారంభమైన ఈ అద్భుత కార్యక్రమం శివరాత్రి రోజు ఫిబ్రవరి 26తో ముగుస్తోంది. ఇప్పటివరకు దేశ విదేశాల నుంచి త్రివేణి సంగమానికి వచ్చిన భక్తుల సంఖ్య 60 కోట్లు దాటినట్లు సీఎం యోగి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా టెంపుల్ టూరిజం పెరిగింది. ప్రయాగ్‌రాజ్‌తో పాటు అయోధ్య, వారణాసి, మథురలకు పెద్ద ఎత్తున భక్తుల తాకిడి పెరిగింది.

ఇదిలా ఉంటే, తాజాగా ప్రయాగ్‌రాజ్‌కి చెందిన ఓ వ్యక్తి రెడ్డిట్ పోస్టు అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రయాగ్‌రాజ్ అధికారికంగా దాని “బ్రేకింగ్ పాయింట్”కి చేరుకుందని ఒక నివాసి అన్నారు. పర్యాటకుల సంఖ్య భారీగా ఉండటం వల్ల స్థానికులు తమ దైనందిన జీవితాన్ని గడపడం కష్టతరం అయిందని చెప్పారు. మహాకుంభ నగర సమగ్ర నిర్మాణంలో భాగంగా కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు మరియు మెరుగైన ట్రాఫిక్ నియంత్రణతో నగరం గత సంవత్సరంతో పోలిస్తే ఎలా మారిపోయిందో సదరు యూజర్ వివరించారు. అయితే, ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం పట్ల ఉన్న ఉత్సాహం, ఇప్పుడు పూర్తిగా ‘‘అలసట’’ మారిపోయిందని అన్నారు.

Read Also: Bengaluru: “మాజీ ప్రియురాలి” ఇంటిని తగలబెట్టిన వ్యక్తి.. కార్లు, బైకులకు నిప్పు..

‘‘ఇప్పుడు ఫిబ్రవరి 19. చివరి అమృతస్నానం ఇప్పటికే పూర్తయింది. కుంభ్ ముగింపు దశలో ఉన్నాము. అయినా కుంభ్‌కి జనసమూహం ఎందుకు తగ్గకుండా పెరుగుతోంది’’ అని అతను తన పోస్ట్‌లో ప్రశ్నించారు. ప్రయాగ్‌రాజ్‌లో దిగజారుతున్న పరిస్థితుల్ని వివరించారు. రహదారులు రద్దీగా మారాయి, చిన్న రోడ్లు కూడా కార్లు, వాహనాలతో నిండిపోయాయి. రద్దీకి స్థానికుల్ని కొందరు నిందిస్తున్నారని చెప్పారు.

భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. ‘‘దయచేసి దేవుడి ప్రేమ కోసం రావడం మానేయండి, గంగా సంగమం ఎక్కడికీ వెళ్లడం లేదు. మీరు తర్వాత ప్రశాంతంగా రావచ్చు. ఈ నగరం, ఇక్కడి ప్రజలపై కాస్త దయ చూపండి. మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం’’ అని రాశారు. పాదచారులు ఎలాంటి మర్యాద లేకుండా రోడ్లపై ఉమ్మివేస్తున్నారని, చెత్త వేస్తున్నారని, ట్రాఫిక్ పరిస్థితి మరింత దిగజారిందని పోస్టులో పేర్కొన్నారు.

Exit mobile version