Site icon NTV Telugu

Viral News : బకెట్‌ నీళ్లు కావాలన్నా.. బావిలోకి దిగాల్సిందే..

Water

Water

అక్కడ ఒక బకెట్‌ నీళ్లుకావాలన్నా బావిలోకి దిగాల్సిందే.. ఎలాంటి సాయం లేకుండా కేవలం బావిలోని రాళ్లనే మెట్లుగా చేసుకొని ఎక్కడం దిగడం చేయాల్సిందే.. ఎక్కటప్పుడో దిగేటప్పుడో ప్రమాదవశాత్తు కాలజారితే భారం అంతా భగవంతుడిపైనే.. నీటి ఎద్దడికి నిలువుటద్దంలా ఓ మహిళ బావిలో దిగి నీళ్లు తీస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరతను ఈ వీడియో సాక్షిబూతమవుతోంది. వీడియోలో ఓ మహిళ నీటి కోసం ఎలాంటి తాడు, నిచ్చెన సాయం లేకుండా బావిలో దిగుతున్నట్లు కనిపిస్తోంది. ఘుసియా గ్రామంలో బావులు, చెరువులు ఎండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తోంది.

భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాలు ఇలాంటి నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నీటి కోసం భారతీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టే వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్‌లో, మహారాష్ట్రలో నీటి కోసం ఒక మహిళ బావిలో దిగుతున్నట్లు ఇలాంటి వీడియో వైరల్‌గా మారింది. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఘుసియా గ్రామంలోని ప్రజల నీటి కష్టాలకు ఈ వీడియో నిదర్శనంగా నిలిచింది. 2019 ప్రపంచ నివేదికలో “నీటి ఒత్తిడి” “అత్యంత ఎక్కువగా” ఉన్న 17 దేశాలలో భారతదేశం ఒకటి.

దేశంలోని మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా రాష్ట్రాలు సంక్షోభంలో తీవ్రంగా దెబ్బతిన్నాయని నివేదిక పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో ప్రతి వేసవిలో నీటి కొరత పునరావృతమయ్యే సమస్య. రాష్ట్ర ప్రభుత్వం 2024 నాటికి ప్రతి గ్రామానికి కుళాయి నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది.కానీ ఇప్పటికీ లక్షలాది మందికి తాగునీరు అందడం లేదు. ఘుసియాలో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా ఈ సంవత్సరం స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని అంటున్నారు.

Exit mobile version