NTV Telugu Site icon

Anna University Case: అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి.. సుమోటోగా స్వీకరించిన మద్రాస్ హైకోర్టు..

Madras High Court

Madras High Court

Anna University Case: చెన్నై అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన తమిళనాడులో పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార డీఎంకే పార్టీ కార్యకర్త నిందితుల్లో ఒకరని బీజేపీ ఆరోపిస్తోంది. ఇందుకు సాక్ష్యాంగా స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్‌‌తో ఉన్న నిందితుడి ఫోటోలను షేర్ చేసింది. ఇదిలా ఉంటే అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసును మద్రాస్ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. వివరణాత్మ నివేదిక దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం, పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు వచ్చాయి. విద్యార్థుల భద్రతపై చర్యలు తీసుకోవాలని, సీబీఐ విచారణ చేపట్టాలని న్యాయవాడులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు విచారణ డిసెంబర్ 28 శనివారానికి వాయిదా పడింది.

న్యాయవాది ఆర్ వరలక్ష్మీ నుంచి వచ్చిన లేఖ పోలీసులు దర్యాప్తులోని లోపాలను ఎత్తి చూపింది. ఈ కేసు ఎఫ్ఐఆర్‌లోని బాధితురాలి వివరాలు బయటకు రావడంతో కేసు కోర్టుకు చేరింది. బాధితురాలు ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని పేర్కొనగా, పోలసీులు కేవలం ఒకరిని మాత్రమే అరెస్ట్ చేయడంపై గందరగోళం నెలకొంది. దీంతో వరలక్ష్మీ ఈ కేసుని సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టుని కోరారు. మరో న్యాయవాది కృష్ణమూర్తి, ఎఫ్ఐఆర్ బహిర్గతం కావడంతో బాధితురాలి కుటుంబం ఎదుర్కొంటున్న బాధను ఎత్తి చూపారు. విద్యాసంస్థల్లో హాస్టళ్లలో మహిళ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థాగత సమస్యను పరిష్కరించాలని కోర్టును కోరారు.

Read Also: Kazakhstan Plane Crash: జీపీఎస్ జామింగ్.. కజకిస్తాన్‌లో విమానం కూలేలా చేశారా..?

న్యాయమూర్తులు ఎస్‌ఎం సుబ్రమణ్యం, వి లక్ష్మీ నారాయణన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, చెన్నై సిటీ పోలీస్ కమిషనర్, అన్నా యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్,రిజిస్ట్రార్, కొత్తూరుపురం ఇన్‌స్పెక్టర్‌తో సహా పలు పక్షాలను ప్రతివాదులుగా పేర్కొంది. ఈ కేసుపై నివేదిక ఇవ్వాలని విద్యార్థుల భద్రతకు విస్తృత చర్యలు అందించాలి కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నిమిత్తం డిసెంబర్ 28వ తేదీ ఉదయం 10.30 గంటలకు వాయిదా వేశారు.

యూనివర్సిటీలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడి చేశారు. తన ప్రియుడితో మాట్లాడుతున్న సమయంలో, ఇద్దరు వ్యక్తులు వచ్చి దాడి చేశారు. ప్రియుడి కొట్టి, విద్యార్థినిపై లైంగిక దాడి చేశారు. డిసెంబర్ 23 సాయంత్రం ఈ ఘటన జరిగింది. మంగళవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత యువతి యూనివర్సిటీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ ఘటన జరగడంపై ప్రతిపక్షాలు ఎంకే స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.