TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!

  • మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
  • టీవీకే పార్టీకి కోలుకోలేని దెబ్బ
  • శ్రీనివాస సేతుపతిపై సంచలన ఆంక్షలు
  • సేతుపతి విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా స్టే
Periyakaruppan Srinivasa Sethupathi

Periyakaruppan Srinivasa Sethupathi

తమిళనాడు అసెంబ్లీలో బలాబలాల పరీక్షకు ముందే టీవీకే పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. తిరుపత్తూరు నియోజకవర్గ ఫలితంపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. గెలిచిన అభ్యర్థి శ్రీనివాస సేతుపతిపై సంచలన ఆంక్షలు విధించింది. మే 13లోగా సభలో జరిగే విశ్వాస పరీక్షలో ఆయన పాల్గొనకుండా స్టే ఇస్తూ వేసవి విరామ కాల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

​ఇటీవల జరిగిన అసెంబ్లీలో ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి చేతిలో డీఎంకే సీనియర్ నేత పెరియకరుప్పన్ కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమి వెనుక అధికారుల ఘోర తప్పిదం ఉందని ఆయన కోర్టును ఆశ్రయించారు. తమిళనాడులో తిరుపత్తూరు పేరుతో రెండు నియోజకవర్గాలు ఉండటమే ఈ వివాదానికి మూలమైంది. శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు ఓట్లను, పొరపాటున తిరుపత్తూరు జిల్లాలోని కౌంటింగ్ కేంద్రానికి పంపారని ఆయన తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో జరిగిన ఈ పొరపాటు వల్లే తాను ఓడిపోయానని పెరియకరుప్పన్ సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు.

కేవలం ఒక్క ఓటుతోనే గెలుపోటములు నిర్ణయించబడినప్పుడు ఇటువంటి గందరగోళం అభ్యర్థి హక్కులను దెబ్బతీస్తుందని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎల్. విక్టోరియా గౌరి, జస్టిస్ ఎన్. సెంథిల్ కుమార్‌ల ధర్మాసనం.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు టీవీకే ఎమ్మెల్యే సభలో ఓటు వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బుధవారం జరిగే విశ్వాస పరీక్షలో టీవీకే పార్టీ ఒక ఓటును కోల్పోవడం ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఒక్క ఓటు తేడాతో గెలిచిన ఎమ్మెల్యేకు, ఇప్పుడు ఆ ఒక్క ఓటు వివాదమే శాపంగా మారింది. ఆదివారం నాడు కోర్టు ప్రత్యేకంగా సమావేశమై ఈ తీర్పు ఇవ్వడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.