School Girls Cleaning Toilets in Madhya pradesh: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్లలో భోజనాన్ని వడ్డించడం వివాదాస్పదం అయింది. దీనిపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులు టాయిలెట్లను క్లీన్ చేయడం వివాదాస్పదం అయింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థ లోపాలు తరుచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఈ వివాదంపై శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం సీరియస్ అంది.
Read Also: Hyderabad Metro Rail: మెట్రో రైల్ పిల్లర్‌పై పోస్టర్ వేస్తే రంగు పడుద్ది.. ఫైను, జైలు..!
మధ్యప్రదేశ్ గుణ జిల్లాలోని ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థినులు టాయిలెట్లు శుభ్రం చేస్తున్న ఫోటోలు గురువారం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. గుణ జిల్లాలోని చక్‌దేవ్‌పూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని స్కూల్ యూనిఫాం ధరించిన విద్యార్థినులు టాయిలెట్లను శుభ్రం చేయడం కనిపిస్తుంది. ఈ ఫోటోలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరపాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రి మహేంద్ర సింగ్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
బాలికలు 5,6 తరగతి విద్యార్థులుగా గుర్తించారు. వారు చేతుల్లో చీపుర్లు పట్టుకుని పాఠశాలలోని టాయిలెట్లను శుభ్రం చేయడం ఫోటోల్లో చూడవచ్చు. విద్యాశాఖ గురువారం పాఠశాల చేరుకుని విచారణ జరిపింది. పాఠశాల ప్రిన్సిపాల్ అధికారిక సమావేశానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న అధికారులు దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది.
