Lumpy Skin Disease in gujarat: గుజరాత్ రాష్ట్రంలో వింత వ్యాధి కలవరపెడుతోంది. లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్ఎస్డీ)గా పలిచే ఈ వ్యాధి అత్యంత వేగంగా పశువులకు వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి 33 వేల ఆవులు, గేదెలకు సోకినట్లుగా తెలుస్తోంది. వ్యాధి కారణంగా 1000కి పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. మరో వైపు సరిహద్దు రాష్ట్రం రాజస్థాన్ లో కూడా ఈ వ్యాధి ఉన్నట్లు కేంద్ర మత్స్య, పశువర్థక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాల వెల్లడించారు. ఈ వ్యాధిని నివారించేందుకు కేంద్రం నుంచి బృందాలను గుజరాత్, రాజస్థాన్‌లకు పంపింది.
పశువుల ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు.. వ్యాధి సోకిన పశువులను వేరు చేస్తున్నట్లు, వ్యాధి సోకిన పశువులకు వ్యాక్సినేషన్ జరుగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. లంపీ స్కిన్ డిసీజ్ మొదటిసారిగా 2019లో ఒడిశాలో కనుక్కున్నారు. ఆ తరువాత ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, గోవా, హర్యానా, NCT-ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో కూడా వెలుగులోకి వచ్చింది.
లంపీ స్కిన్ డిసీజ్ చర్మాన్ని ప్రభావితం చేసే వ్యాధి. ఈగలు, పేనులు, కందిరీగాల ద్వారా పశువులకు ప్రత్యక్షంగా సోకుతుంది. దీంతో పాటు కలుషితమైన నీరు, ఆహారం ద్వారా కూడా ఈ వైరస్ వ్యాధి సోకుతుంది. జంతువుల్లో జ్వరం, కళ్లు, ముక్కు నుంచి స్రావాలు కారుతుండటం, నోటి నుంచి లాలాజలం కారడం.. పాల ఉత్పత్తి తగ్గడం, చర్మపై గడ్డలు కలగడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. వీటిలో జంతువులకు మరణం సంభవిస్తుంది.