పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొత్తం ఆందోళనలు, నిరసనలతో హోరెత్తాయి… ఓవైపు పెగాసస్ వ్యవహారం.. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలపై ఆందోళన.. ఇలా రకరాల సమస్యలపై నిత్యం పార్లమెంట్ ఉభయసభల్లో ఏదో ఒక రచ్చ జరుగుతూనే వచ్చింది… షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉన్నా.. లోక్‌సభను ఇవాళే నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్.. ఇక, ఈ సమావేశాల్లో లోక్‌సభ మొత్తంగా 21.14 గంటలు మాత్రమే పనిచేసింది… విపక్షాల నిరసనల కారణంగా ఏకంగా 74 గంటల సమయం వృథా అయ్యింది. జూన్ 19న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా.. పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేసింది. పెగాసస్‌పై చర్చకు తొలిరోజూ నుంచే పట్టుబడుతూ వచ్చాయి ప్రతిపక్షాలు.. దీంతో సభలో వాయిదాల పర్వం నడిచింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మొత్తంగా లోక్‌సభ 17 సార్లు సమావేశం కాగా.. అందులో మొత్తం 96 పనిగంటలు ఉన్నాయి.. కానీ, లోక్‌సభ కేవలం 21 గంటల 14 నిమిషాలు మాత్రమే పనిచేసింది. ప్రతిపక్షాల ఆందోళనలతో 74.46 గంటల సమయం వృథా అయిపోయింది. లోక్‌సభ పనిచేసింది కేవలం 22 శాతమేనని వెల్లడించిన స్పీకర్ ఓం బిర్లా.. ఇది చాలా బాధ కలిగించిందని చెప్పారు. మరోవైపు.. విపక్షాల ఆందోళన మధ్యే బిల్లులు ప్రవేశపెడుతూ వచ్చింది ప్రభుత్వం.. ఈ సమావేశాల్లో మొత్తంగా 20 బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందాయి.