NTV Telugu Site icon

Tamil Nadu Floods: తమిళనాడులో హృదయవిదారక ఘటనలు.. ఇళ్ల ముందే శవాలను కాల్చుతున్న వైనం.

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu Floods: భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. వర్షాలు తగ్గినప్పటికీ, ప్రజల్ని కష్టాలు వీడటం లేదు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు గత వారం కురిసిన వర్షాలకు చాలా ప్రభావితమైంది. తూత్తుకూడి ప్రాంతం దారుణంగా దెబ్బతింది. వరదల ధాటికి కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ ప్రాంతంలో కొత్త సమస్యలు మొదలయ్యాయి.

వరదల వల్ల శ్మశాన వాటికలు మునిగిపోవడంతో అక్కడి ప్రజలు శవాలను ఇళ్ల ముందే కాల్చే దుస్థితి ఏర్పడింది. చనిపోయిన వారికి ఇంటి ముందే అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. దీని కోసం మొబైల్ శ్మశానవాటికను ఉపయోగిస్తు్న్నారు. ఎల్పీజీ సిలిండర్లు వాడి శవాలను దహనం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తన్న వర్షం కారణంగా వివిధ కులాలకు చెందిన వారికి కేటాయించిన 12 శ్మశాన వాటికలు నిరుపయోగంగా మారడంతో అక్కడి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు.

Read Also: Ram Charan: బ్రేకింగ్.. సీఎంను కలిసిన రామ్ చరణ్ దంపతులు

శ్మశాన వాటికలు ఇప్పటికీ రెండు అడుగుల నీటిలో మునిగి ఉన్నాయని తూత్తుకుడి కార్పొరేషన్ నివాసి గణేశన్ తెలిపారు. కొంతమంది తమవారి మృతదేహాలను దహన సంస్కారాల కోసం సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. చాలా మంది ప్రజలు మృతదేహాలను ఖననం చేయడానికి తిరువణ్ణామలై లేదా కోవిల్‌పట్టికి తరలిస్తున్నారని అన్నారు. నీరు పూర్తిగా తగ్గినప్పటికీ.. మృతదేహాలను పూడ్చి పెట్టేందుకు అనువుగా ఉండాలంటే మరో 5 నెలలు పడుతుందని గణేశన్ పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల కారణంగా స్థానికులు రెండు ఎల్పీజీ సిలిండర్లు ఉపయోగించి తాత్కాలిక శ్మశానవాటికను ఏర్పాటు చేశారు. క్రైస్తవులు తమ బందువుల మృతదేహాలను వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. హిందువులు దహనసంస్కారాల కోసం మొబైల్ శ్మశాన వాటికను ఉపయోగిస్తున్నారు. తూత్తుకుడితో పాటు తిరునెల్వేలి జిల్లాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల్ని ఎదుర్కొన్నాయి.

Show comments