Delhi Liquor Scam: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే కౌంటింగ్‌లో కనిపించాయి. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఆప్ కీలక నేతలంతా ఒక్కొక్కరుగా ఓటమి పాలయ్యారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సోమనాథ్ భారతి వంటి కీలక నేతలు ఓడిపోయారు.
Read Also: Manish Sisodia: మనీష్ సిసోడియా ఓటమి..
లిక్కర్ స్కామ్‌లో జైలుకెళ్లిని కేజ్రీవాల్, సిసోడియా, సత్యేందర్ జైన్ ఓడిపోవడం గమనార్హం. సాధారణంగా జైలుకు వెళ్లి వచ్చిన ఏ నాయకుడికైనా సింపతి వస్తుంది, అయితే ఢిల్లీ ఓటర్లు మాత్రం లిక్కర్ స్కామ్‌లో వీరి హస్తం ఉందని భావించినట్లు ఉన్నారు. అందుకే ముగ్గురిని కూడా చావుదెబ్బ తీశారు. తనను కావాలనే బీజేపీ టార్గెట్ చేస్తోందని కేజ్రీవాల్ పదేపదే ఆరోపించినప్పటికీ ఢిల్లీ ఓటర్లు నమ్మలేదు. లిక్కర్ స్కామ్‌కి తోడు శీష్ మహల్, ప్రభుత్వ వ్యతిరేకత, మధ్య తరగతి వర్గాలు బీజేపీ వైపు వెళ్లడం ఇవన్నీ ఆప్ ఓటమికి కారణమని చెప్పవచ్చు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ని విచారిస్తున్న సీబీఐ, ఈడీలు ఈ కేసులో ఆప్ నేతల్ని అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసి, అతిశీ మార్లెనాకు ఢిల్లీ పగ్గాలు అప్పగించి, అనధికార సీఎంగా పనిచేశారనే వాదనలు ఉన్నాయి. అయితే, తన నిజాయితీని ఢిల్లీ ప్రజలు నమ్ముతారని, మళ్లీ తననే అధికారంలోకి తీసుకువస్తారని కేజ్రీవాల్ భావించారు. తన నిజాయితీకి అసెంబ్లీ ఎన్నికలు రెఫరెండం అని, తనను కాపాడే బాధ్యత ఢిల్లీ ఓటర్లదే అని సెంటిమెంట్ కామెంట్స్ చేశారు. అయినా కూడా జైలుకు వెళ్లి వచ్చిన ముగ్గురు నేతలకు ఓటమి తప్పలేదు.