Himanta Biswa Sarma: రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడంపై బీజేపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. హిందువుల వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శిస్తోంది. తాజాగా అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ కాంగ్రెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ మందిర ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా ఆ పార్టీ హిందూ వ్యతిరేకి అని స్పష్టమైందని ఆయన గురువారం అన్నారు. మతాన్ని వ్యక్తిగత విషయంగా పేర్కొంటూ, రామమందిరాన్ని బీజేపీ “రాజకీయ ప్రాజెక్ట్”గా పేర్కొంటూ, జనవరి 22న అయోధ్యలో జరగనున్న మహా కార్యక్రమానికి హాజరు కావడానికి కాంగ్రెస్ బుధవారం నిరాకరించింది.
ఇది కాంగ్రెస్ పార్టీకి హిందువులను వ్యతిరేకించడం కొత్త కాదని.. జవహర్ లాల్ నెహ్రూ మే 1951లో సోమనాథ్ ఆలయ కార్యక్రమాన్ని ఇలాగే బహిష్కరించారని, ఇప్పుడు కాంగ్రెస్ రామాలయ కార్యక్రమాన్ని బహిష్కరించిందని అన్నారు. సోమనాథ్ ఆలయానికి పండిట్ నెహ్రూ ఏం చేశారో, రామమందిరం విషయంలో కాంగ్రెస్ అధిష్టానం చేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ కొన్ని దశాబ్ధాల నుంచి హిందూ వ్యతిరేక పార్టీగా పరిగణించబడుతోందని, హిందూ నాగరికతను గౌరవించాలంటే ముస్లిం వ్యతిరేకిగా ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ హిందూ కమ్యూనిటికీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని, వాళ్ల రామ మందిర కార్యక్రమానికి వచ్చే అర్హత లేదని హిమంత బిశ్వ సర్మ అన్నారు. వీహెచ్‌పీ తెలిసీ తెలియక కాంగ్రెస్ చేసిన పాపాల పరిహారానికి, రామ మందిర వేడుకలకు ఆహ్వానించిందని అన్నారు. అయితే ఈ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వదులుకుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదని కాంగ్రెస్ ప్రకటించగా.. ఇదే దారిలో టీఎంసీ, వామపక్షాలు వెళ్లడం లేదని ప్రకటించాయి.