Priyanka Gandhi: కాంగ్రెస్ నేతలు తనను 91 సార్లు దూషించారని ఇటీవల ప్రధాని మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రజాజీవితంలో ఉన్న వాళ్లు ఇలాంటి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, తన సోదరుడు రాహుల్ గాంధీ దేశం కోసం బుల్లెట్ దాడులకు కూడా భయపడటం లేదని, ఆయనను చూసి నేర్చుకోవాలని ప్రియాంకాగాంధీ, ప్రధాని మోడీకి సూచించారు. ఇటీవల కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మోడీని విషసర్పంతో పోలుస్తూ విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తనపై కాంగ్రెస్ నేతలు 91 సార్లు దూషణలకు పాల్పడ్డారని అన్నారు.
Read Also: CSK vs PBKS: బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్న పంజాబ్.. 10 ఓవర్లకు స్కోర్ ఇదే..
ఈ రోజు కర్ణాటకలో ని బాగల్ కోట్ జిల్లాలో జరిగి బహిరంగ సభలో ప్రియాంకాగాంధీ మాట్లాడారు. మీకు జరిగిన దూషణలు కేవలం ఒక పేజీలో సరిపోతాయని, మీరు నా కుటుంబం పట్ల ప్రవర్తించిన తీరుకు ఒక పుస్తకమే నిండుతుందని ఆమె అన్నారు. గత రెండు మూడు రోజుల నుంచి ప్రధాని నరేంద్రమోడీని చూస్తే వింతగా ఉందని, నేను చాలా మంది ప్రధానులను చూశాను, ఇందిరాగాంధీ దేశం కోసం బుల్లెట్ గాయాలను తీసుకుంది, రాజీవ్ గాంధీ తన ప్రాణాలు అర్పించారు, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ దేశం కోసం కష్టపడ్డారు, కానీ మోడీ లాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదని ప్రియాంకాగాంధీ అన్నారు.
ప్రజల బాధలను వినేందుకు వచ్చే ప్రధానులను చూశాను కానీ, తనను తిడుతున్నారని ప్రజల ముందు తన బాధలను చెప్పే ప్రధానిని మోడీనే చూశానని ఆమె అన్నారు. ‘‘నా సోదరుడు రాహుల్ గాంధీని చూసి దైర్యం తెచ్చుకోండి మోడీజీ.. ఈ దేశం కోసం బుల్లెట్ దెబ్బలుతినేందుకు సిద్ధంగా ఉన్నారు, మీరు దూషించినా, కాల్చి చంపినా, నిజం కోసం నిలబడతానని రాహుల్ గాంధీ చెప్పాడు’’ అని ప్రియాంకాగాంధీ అన్నారు.