NTV Telugu Site icon

IT layoffs: ఇండియన్ ఐటీలో లేఆఫ్స్.. షేర్ చాట్‌తో పాటు ఇప్పటికే పలు కంపెనీల్లో కోతలు

It Industry

It Industry

Layoffs in the Indian tech industry: భారతీయ టెక్ పరిశ్రమల్లో కూడా లేఆఫ్స్ ఉండబోతున్నాయా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్, మెటా, యాపిల్, గూగుల్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ప్రపంచవ్యాప్తంగా ముంచుకొస్తున్న ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో తమ నష్టాలను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రభావం భారత కంపెనీలపై కూడా పడుతోంది.

తాజాగా భారతీయ టెక్ కంపెనీ షేర్ చాట్ కూడా తన కంపెనీలో 20 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏకంగా 500 మంది వరకు ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. గత డిసెంబర్ నెలలో 5 శాతం ఉద్యోగులను తీసేసిన తర్వాత, తాజాగా కోతలను ప్రకటించింది. మహమ్మారి సమయంలో షార్ట్-ఫారమ్ వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ భారీ ప్రజాదరణ పొందినప్పటికీ, ఇన్‌స్టాగ్రామ్ నుండి కఠినమైన పోటీ ఎదుర్కొంటోంది. భారతదేశంలో షేర్ చాట్ ఒక్కటే కాదు మరిన్ని సంస్థలు కూడా ఉద్యోగులను వదిలించుకునే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మార్చి వరకు ప్రాజెక్టులు ఉండటంతో అప్పటి వరకు పెద్దగా లేఆఫ్స్ ఉండకపోవచ్చని.. ఆ తరువాత ఉండే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు.

Read Also: Bumper Offer : గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇద్దర్ని కంటే ఇంక్రిమెంట్.. ముగ్గుర్ని కంటే డబుల్ ఇంక్రిమెంట్

ఓలా కూడా ఇప్పటికే తన ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. ఓలా క్యాబ్స్, ఓలా ఎలక్ట్రిక్ మరియు ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ వర్టికల్స్ నుండి 200 మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. సెప్టెంబర్ లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఉద్యోగాల కోత ఆలస్యం అవుతోంది. గతేడాది ఓలా స్టోర్-టు-డోర్ డెలివరీ సర్వీస్ ఓలా డాష్‌తో పాటు ఓలా కార్లను మూసివేసింది.

అమెజాన్ లో జనవరి 18 నుంచి 18,000 మంది ఉద్యోగలను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీంట్లో భాగంగా ఇండియాలో పనిచేస్తున్న వారి ఉద్యోగాలు కూడా ఊడనున్నాయి. ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్ ఫాం బైజూస్ కూడా తమ 50,000 మంది ఉద్యోగుల్లో ఈ ఏడాది మార్చి నాటికి 5 శాతం ఉద్యోగులను తగ్గించి ఖర్చులను తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. కరోనా సమయంలో బైజూస్ కు బాగా ఆదరణ పెరిగినా.. ఇటీవల ఇండియాలో కరోనా ప్రభావం తగ్గడం, రెగ్యులర్ గా స్కూళ్లు నడుస్తుండటంతో బైజూస్ వ్యాపారానికి దెబ్బ పడింది. భారతీయ కిరాణా డెలివరీ సర్వీస్ డంజో కూడా తన ఉద్యోగుల్లో 3 శాతం మందిని తీసేస్తున్నట్లు ధృవీకరించింది.

Show comments