NTV Telugu Site icon

Lawrence Bishnoi: లారెన్స్‌ బిష్ణోయ్‌ తమ్ముడితో సిద్ధిఖీ హత్య కేసు నిందితుల చాట్‌

Lawrence

Lawrence

Lawrence Bishnoi: ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య సంచలనం రేపింది. కాగా, ఈ కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. సిద్ధిఖీని హత్య చేయడానికి ముందు లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌తో షూటర్లు సంప్రదింపులు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్నాప్‌చాట్‌ ద్వారా నిందితులు తరచూ అన్మోల్‌తో మాట్లాడినట్లు గుర్తించామన్నారు. స్నాప్‌చాట్‌లో 24 గంటల్లోపు చాట్‌ మాయమయ్యే ఆప్షన్‌ను ఉపయోగించి సంప్రదింపులు చేశారని.. దాని ద్వారానే అన్మోల్‌ వారికి సిద్దిఖీ, అతడి కుమారుడి ఫొటోలు పంపాడని నిందితులు వెల్లడించారని చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేయగా.. మరో నిందితుడు శివకుమార్‌ గౌతమ్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.

Read Also: Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతులు..

ఇక, స్నాప్‌చాట్‌లో 24 గంటల తర్వాత మెసేజ్‌లు మాయమయ్యే ఆప్షన్‌ ఉండటం వల్ల వారి సంభాషణలను సేకరించలేకపోయినట్లు పోలీసులు వెల్లడించారు. సిద్దిఖీని హత్య చేసేందుకు కాంట్రాక్ట్‌ తీసుకున్న షూటర్లు దాడికి ముందు అటవీ ప్రాంతంలో షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేసినట్లు చెప్పుకొచ్చారు. దీనిపై విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు కీలక నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి ఆఫీసులో ఉన్న సిద్ధిఖీపై దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఆ తర్వాత సిద్దిఖీని చంపింది తామే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ వెల్లడించింది.

Read Also: Yadadri Temple: భక్తులకు అలర్ట్‌.. యాదాద్రిలో ఇక నుంచి అలా చేయడం నిషేధం..

అయితే, అండర్‌ వరల్డ్‌ డాన్ దావూద్‌ ఇబ్రహీంతో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీకి సంబంధం ఉన్నందు వల్లే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేర్కొంది. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు సహాయం చేసే ఎవరిని కూడా వదిలి పెట్టబోమని హెచ్చరించారు. దీంతో పాటు సిద్దిఖీ కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ కూడా బిష్ణోయ్ గ్యాంగ్‌ హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.