L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..

  • కేంద్రమంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా..
  • తమిళనాడులో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని మోడీకి లేఖ..
L Murugan

L Murugan

L Murugan Resigns: కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి ఎల్. మురుగన్ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ప్రధాని నరేంద్రమోడీకి ఎల్ మురుగన్ లేఖ రాశారు. తన భవిష్యత్ కార్యాచరణను వివరించారు.

తాను ఇప్పుడు పూర్తి సమాయాన్ని తమిళనాడులో బీజేపీ బలోపేతానికి, 2029 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావడానికి కేటాయించాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో 5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో పనిచేయడం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేడయంతో పాటు 2029 లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడమే తన ప్రాధాన్యత అని అన్నారు.

మోడీకి రాసిన లేఖలో తాను ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఈ స్థాయికి వచ్చానని, తన కష్టాలను వివరించారు. తన తల్లిదండ్రులు రోజూవారీ కూలీలుగా, పశువుల కాపరులుగా పనిచేశారని, ఇప్పటికీ తన కుటుంబం తమిళనాడులోని కోనూర్‌లో సాదాసీదా జీవితం గడుపుతోందని తెలిపారు. తమ కుమారుడు ఒకరోజు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అవుతాడని తన తల్లిదండ్రులు ఎప్పుడూ ఊహించలేదని ఆయన అన్నారు. తన రాజకీయ ప్రస్థానానికి ప్రధాని మోదీ నాయకత్వం, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎదిగేందుకు అవకాశాలు కల్పించే బీజేపీ సంప్రదాయమే కారణమని మురుగన్ పేర్కొన్నారు.

మురుగన్ రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ వైస్-ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన గత 5 ఏళ్లుగా మోడీ మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. సమాచార మరియు ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాలు, మత్స్య, మరియు పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు.