Site icon NTV Telugu

Kolkata Metro: దేశంలో తొలిసారిగా “అండర్ రివర్ మెట్రో రైల్” పరుగు.. వీడియో చూడండి..

Kolkata Metro

Kolkata Metro

Kolkata Metro Runs Under River, First In India: కోల్‌కతా మెట్రో రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలో తొలిసారిగా నదీ గర్భం నుంచి మెట్రో రైల్ పరుగులు తీసింది. హుగ్లీ నది నుంచి ఏర్పాటు చేసిన సొరంగం గుండా మెట్రో రైల్ పరుగులు పెట్టింది. ఈ విషయాన్ని బుధవారం సీనియర్ అధికారి వెల్లడించారు. అధికారులు, ఇంజనీర్లతో కూడిన మెట్రో రైల్ హుగ్లీ నది కింద నుంచి కోల్‌కతా నుండి నదికి అవతలి వైపున హౌరా వరకు నడిచింది. కోల్‌కతా మరియు దాని శివారు ప్రాంతాల ప్రజలకు ఆధునిక రవాణా వ్యవస్థను అందించడంలో ఇది విప్లవాత్మక అడుగుగా అధికారులు అభివర్ణించారు.

మెట్రో రైల్వే జనరల్ మేనేజర్ పి ఉదయ్ కుమార్ రెడ్డి కోల్‌కతాలోని మహాకరణ్ స్టేషన్ నుండి ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్‌లోని హౌరా మైదాన్ స్టేషన్ వరకు మెట్రో బోగీలో ప్రయాణించారు. రాబోయే ఏడు నెలల పాటు హౌరా మైదాన్, ఎస్ప్లానేడ్ స్టేషన్ మధ్య ట్రయల్ రన్స్ నిర్వహిస్తామని, ఆ తర్వాత సాధారణ సేవలు ప్రారంభం అవుతాయని, అండర్‌గ్రౌండ్ సెక్షన్‌లోని 4.8 కి.మీ మేర ట్రయల్ రన్ త్వరలో ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు.

Read Also: China: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. అమ్మపై కంప్లైంట్ చేయడానికి 130 కిలోమీటర్లు ప్రయాణం..

హౌరా మైదాన్ దేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇది భూ ఉపరితలం నుంచి 33 మీటర్ల దిగువన ఉంది. హుగ్లీ నది కింద 520 మీటర్ల పొడవును 45 సెకన్లలో మెట్రో రైల్ కవర్ చేస్తుందని, నది కింద ఉన్న సొరంగం నీటి ఉపరితలానికి 32 మీటర్ల దిగువన ఉందని అధికారులు వెల్లడించారు.

సెంట్రల్ కోల్‌కతాలోని బౌబజార్ ప్రాంతంలో జరిగిన ప్రమాదాల కారణంగా మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేయడం ఆలస్యమైంది. ఆగస్టు 31, 2019న ఒక టెన్నెల్ బోరింగ్ మిషన్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భూమి క్షీణితతో పాటు అనేక భవనాలు కూలిపోవడానికి దారి తీసింది. తూర్పున సీల్డా వైపు నుంచి పశ్చిమా ఉన్న ఎస్ప్లానేడ్ వైపు నుండి వచ్చే సొరంగాలను కలిపే పనిలోకి నీరు ప్రవహించింది. దీంతో ఆ ప్రాంతంలో భూమి క్షీణతకు గురైంది. 2022 మేలో అనేక ఇళ్లు మళ్లీ దెబ్బతిన్నాయి. ఈస్ట్ వెస్ట్ మెట్రో 16.6 కిలోమీటర్ల పొడవులో భూగర్భ కారిడార్ 10.8 కిలోమీటర్ల మేర ఉంది. ఇందులో హౌరా మైదాన్, ఫూల్ బగన్ సొరంగం హుగ్లీ నదికి దిగువన వెళుతోంది.

Exit mobile version