NTV Telugu Site icon

Kolkata Doctor Case: కోల్‌కాతా హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులు తప్పుడు ఆధారాలు సృష్టించారు..

Kolkata

Kolkata

Kolkata Doctor Case: ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ సంచనల వ్యాఖ్యలు చేసింది. తాలా పోలీస్ స్టేషన్‌లో తప్పుడు రికార్డులు సృష్టించారని ఆరోపించింది. తాలా పీఎస్ ఇన్‌ఛార్జ్ అభిజిత్ మండల్, మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌లను కస్టడీలో విచారించిన సీబీఐ.. తమ దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు స్పెషల్ కోర్టుకు తెలిపింది. తాలా పోలీస్ స్టేషన్‌లో కేసుకు సంబంధించి కొన్ని తప్పుడు రికార్డులు సృష్టించబడినట్లు గుర్తించామని పేర్కొనింది. సెప్టెంబరు 14న అభిజిత్ మండల్‌ను అరెస్టు చేయగా, కోర్టు ఆదేశాల మేరకు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సెప్టెంబర్ 15వ తేదీన అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ చెప్పుకొచ్చింది.

Read Also: Sri Lanka vs New Zealand: నేటి నుంచే రెండో టెస్ట్.. కీలక పేసర్ లేకుండానే శ్రీలంక..

కాగా, మాజీ పోలీస్ అధికారి అభిజిత్ మండల్, సందీప్ ఘోష్ తరపు న్యాయవాదులు కోర్టులో అభియోగాలు మోపడానికి బదులుగా సాక్ష్యాలను సమర్పించాలని సీబీఐని కోరారు. అత్యాచారం, హత్య జరిగిన తర్వాత ఆసుపత్రి అధిపతి (ఘోష్) ఇన్‌ఛార్జ్ అధికారితో మాట్లాడటం సహజమని వారు అన్నారు. ఇక మాజీ పోలీస్ అధికారి తరపున న్యాయవాది అయాన్ భట్టాచార్య వాదిస్తూ.. ఇంతకీ సీబీఐ ఎవరిని విచారించింది.. ఈ కేసులో నా క్లైంట్ (మండల్) ప్రమేయం లేదని వాదించారు. అలాగే, సీల్డ్ కవర్‌ను కోర్టు పరిగణించరాదని సందీప్ ఘోష్ తరపు న్యాయవాది జోహైబ్ రవూఫ్ అన్నారు. ఇక, స్పెషల్ కోర్టులో సీల్డ్ కవర్‌ నివేదికను సీబీఐ అధికారులు సమర్పించారు. నిందితులిద్దరికీ సెప్టెంబర్ 30వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని కోరింది. ఇక, సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఇద్దరికీ ఈ నెల 30వ తేదీ వరకు కస్టడీ విధించింది.