Site icon NTV Telugu

West Bengal: రణరంగాన్ని తలపించిన పశ్చిమ బెంగాల్.. పోలీసుపై దాడి వీడియో వైరల్

Kolkata Police

Kolkata Police

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బీజేపీ తలపెట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. బెంగాల్ రణరంగాన్ని తలపించింది. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయిలో చెలరేగాయి. నడి రోడ్లపై రాళ్లు రువ్వడం, కట్టెలతో దాడి చేసుకోవడం, టార్గెట్ చేసుకుని దాడి చేయడం వంటివి చాలా చోట్ల కనిపించాయి. ఓ పోలీసు అధికారిపై నిరసనకారుల దాడి కలకలం రేపింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ మహిళపై పోలీసుల లాఠీచార్జ్ వీడియో కూడా వైరల్ అయింది. పగటిపూట నగరంలోని కొన్ని ప్రాంతాలు యుద్ధ ప్రాంతంగా మారాయి. అక్కడ ఒక వైపు రాళ్ళు మరొక వైపు లాఠీలు, టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు. ఒక పోలీసు వాహనాన్ని కూడా తగులబెట్టారు. ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఎంపీ లాకెట్ ఛటర్జీ సహా కొందరు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హింసాత్మక నిరసనల తర్వాత రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. బీజేపీ, టీఎంసీలు ఒకదానిపై ఒకటి ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకున్నాయి. పోలీసులు రెచ్చగొట్టడం వల్లే ఇంత హింస చెలరేగిందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

పోలీసుపై దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పలువురు వ్యక్తులు అతనిపై దాడి చేయడంతో ఈ వీడియో ప్రారంభమైంది. అతను తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తాడు. కొందరు అతనిపై దెబ్బల వర్షం కురిపించినప్పుడు తన తలను రక్షించుకోవడానికి ఫైబర్ గ్లాస్ షీల్డ్ పట్టుకున్నాడు. ఆ పోలీసు అధికారి తన హెల్మెట్‌ను భద్రంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తన తలను కాపాడుకున్నారు. ఎలాగోలా ఆ మూక నుంచి తప్పించుకుని బయట పడగా.. తెల్ల చొక్కా వేసుకున్న మరో వ్యక్తి ఆ పోలీసు అధికారిని దారుణంగా అడ్డుకున్నాడు. ఆయన ఒక్క ఉదుటన ఆగిపోయాడు. ఓ వ్యక్తి రాయితో వేగంగా కొడుతున్న దృశ్యం వీడియోలో చూడొచ్చు. ఆ రాయి వెళ్లి పోలీసు పొట్టపై తాకింది. ఇతరులు కర్రలతో ఆ పోలీసును కొట్టారు. మరికొందరు చేతులతోనే చితకబాదారు. ఇందులో చాలా మంది బీజేపీ జెండాలు పట్టుకుని ఆ పోలీసుపై దాడి చేసినట్లు కనిపిస్తుంది.

ఆ పోలీసు అక్కడి నుంచి కూడా తప్పించుకుని బారికేడ్లు పెట్టిన వైపు పరిగెత్తాడు. ఇంతలోనే కొందరు ఎదురుగా వచ్చి అతడిని నెట్టేశారు. ఆయన పక్కనే ఉన్న స్కూటీపై పడిపోయారు. ఆ తర్వాత కింద పడిపోయారు. ఆయన చుట్టు చాలా మంది చేరి మళ్లీ దాడి చేశారు. ఇంతలో బ్లూకలర్ టీ షర్ట్ వేసుకున్న ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ పోలీసును కాపాడారు. బహుశా వారు స్థానికులు అని చెబుతున్నారు. ఆ పోలీసు అధికారి చేయి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం.

Exit mobile version