India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!

  • నవ్వులపాలు కావొద్దు, దేశాన్ని అవమానించొద్దు..
  • రాహుల్ గాంధీ హైదరాబాద్ సమ్మిట్‌పై కిరెన్ రిజిజు ఫైర్..
  • ప్రజల విశ్వాసం పొందడానికి 7 సూచనలు..
Kiren Rijiju

Kiren Rijiju

India Summit Row: హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ‘‘భారత్ సమ్మిట్’’ రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది. రాహుల్ గాంధీ సమక్షంలో విదేశీ నేతలు భారత అంతర్గత రాజకీయాల గురించి వ్యాఖ్యానించడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటలీకి చెందిన ఒక నాయకుడు రాహుల్ గాంధీ నినాదమైన ‘‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’’ను పునరావృతం చేశాడు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో వేదికపై ఉన్న రాహుల్ గాంధీ చప్పట్లు కొడుతూ, నవ్వడంపై బీజేపీ ఫైర్ అవుతోంది.

ఈ వివాదంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. రాహుల్ గాంధీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తనను తాను నవ్వులపాలు చేసుకోవడంతో పాటు దేశాన్ని కూడా అవమానించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే రాహుల్ 7 విషయాలపై దృష్టిపెట్టాలని సూచించారు.

రాహుల్ గాంధీ భారత్‌లో ఎక్కువ సమయం గడపాలని, తరచూ రహ్య విదేశీ పర్యటనలకు వెళ్లడం మానుకోవాలని, సీనియర్ నాయకుల్ని గౌరవించాలని, అ అనుభవజ్ఞులైన నేతల నుంచి నేర్చుకోవాలని సూచించారు. ఇదే విధంగా భారత వ్యతిరేక శక్తుల్ని కలవడం, వారి అజెండాలను ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. బీజేపీని శత్రువుగా కాకుండా రాజకీయ ప్రత్యర్థిగా చూడాలని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ పట్ల ద్వేషాన్ని విడిచిపెట్టాలని సూచించారు.

పార్లమెంటు కార్యకలాపాలను రాహుల్ గాంధీ మరింత తీవ్రంగా పరిగణించాలని కిరణ్ రిజిజు కోరారు. చర్చలు, సంభాషణల్లో ఎంపీలు చురుకుగా పాల్గొనేలా చూడాలని సూచించారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను గౌరవించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని, పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో పనిచేయాలని రిజిజు అన్నారు. వంశపారంపర్య రాజకీయాలకు ముగింపు పలకాలని సూచించారు.