NTV Telugu Site icon

Amritpal Singh: 100 కార్లు, గంట పాటు ఛేజ్.. ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్..

Amritpal Singh

Amritpal Singh

Amritpal Singh: ఖలిస్థానీ సానుభూతిపరుడు, వివాదాస్పద నేత అమృత్‌పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ మొత్తం రేపు మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సస్పెండ్ చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పంజాబ్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఏడు జిల్లాల పోలీసులు పక్కా ప్రణాళితో ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నాయకుడిని అరెస్ట్ చేశారు. సినిమాను తలపించే విధంగా 100 కార్లు గంటపాటు ఛేజ్ తర్వాత అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు అతడి మద్దతుదారులు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పంజాబ్ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయకు మద్దతుగా మోహాలీలో కొంతమంది ఆందోళన నిర్వహించారు.

జీ 20 సదస్సు ముగిసిన తర్వాతి రోజు పంజాబ్ పోలీసులు పకడ్భందీ వ్యూహంతో అరెస్ట్ చేశారు. జలంధర్ షాకోట్ కు వస్తున్నట్లు వార్తలు రావడంతో రహదారులను దిగ్భంధించి, పక్కా వ్యూహంతో అతడు ఉన్న గ్రామాన్ని చుట్టుముట్టి అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధం కాగా.. అమృత్ పాల్ సింగ్ పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు 100 కార్లతో గంటపాటు ఛేజ్ చేసి జలంధర్ లోని నాకోదార్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతడి అరెస్ట్ పై అధికారిక ప్రకటన రాలేదు.

Read Also: Weather : తెలంగాణలో భారీ వర్షాలు.. తడిసిన మహానగరం!

‘వారిస్ పంజాబ్ దే’ సంస్థను ప్రారంభించిన దీప్ సిద్దూ మరణించిన అనంతరం ఈ సంస్థకు అమృత్ పాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 24లో అతడి అనుచరుడు లవ్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తే, ఏకంగా అజ్నాలా పోలీస్ స్టేషన్ పైనే తన మద్దతుదారులతో కలిసి దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, ఎస్పీకి గాయాలు అయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అమృత్ పాల్ సింగ్ నేపథ్యం:
సిక్కుల కోసం ప్రత్యేక దేశం కోరుతూ ఖలిస్తాన్ పేరిట పంజాబ్ యువతను ప్రభావితం చేస్తున్నాడు అమృత్ పాల్ సింగ్. 2022 ఫిబ్రవరి వరకు అతడు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే దీప్ సిద్దూ కార్ యాక్సిడెంట్ లో మరణించాడో, అప్పటి నుంచి ‘వారిస్ పంజాబ్ దే’కు నాయకత్వం వహిస్తూ తన అనుచరులకు ఆదేశాలు ఇస్తున్నాడు. దుబాయ్ లో బంధువుల వ్యాపారం చూసుకుంటే ఉండే అమృత్ పాల్ సింగ్ ఇండియాకు వచ్చి ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని మళ్లీ తట్టి లేపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంజనీరింగ్ చదివిన 29 ఏళ్ల అమృత్ పాల్ సింగ్ తొలినాళ్లలో తలపాగా చుట్టుకునేందుకు కూడా ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు ఏకంగా ఖలిస్తానీ దేశం కోరుతూ యువతను రెచ్చగొడుతూ పాపులర్ అయ్యాడు.