Site icon NTV Telugu

Vijay Diwas: భారత్ ముందు తలవంచిన 90 వేల మంది పాక్ సైనికులు.. 1971 ఇండో-పాక్ యుద్ధంలో కీలక సంఘటనలు..

Indo Pak War

Indo Pak War

Vijay Diwas: పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్)కి విముక్తి కల్పించడం కోసం భారత్ 1971లో యుద్ధం చేయాల్సి వచ్చింది. తూర్పు పాకిస్తాన్‌లో ఏకంగా 90,000 మంది సైనికులు భారత్ ముందు లొంగిపోయారు. ఇందిరా గాంధీ ఉక్కు సంకల్పంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. భారత్‌‌పై పాశ్చాత్యదేశాలు, అమెరికాలు ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా.. రష్యా భారత్‌కి అండగా నిలిచింది. 90 వేల మంది పాక్ సైనికులు భారత్ ముందు మోకరిల్లిన ఈరోజున భారత్ ‘విజయ్ దివాస్’ జరుపుకుంటుంది. యాభై రెండు ఏళ్ల క్రితం జరిగి ఈ యుద్ధం పాకిస్తాన్ బలుపును వంచింది.

నింగి, నేల, నీరు అంతటా భారత్ ఆధిపత్యమే:

ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్తాన్(పాకిస్తాన్) ఒకే దేశంగా ఉండేవి. అయితే తూర్పు పాక్‌లో బెంగాలీ భాష ఎక్కువగా మాట్లాడేవారు. వీరిపై బలవంతంగా ఉర్దూను రుద్దే ప్రయత్నమే బంగ్లాదేశ్ ఏర్పాటుకు మూల కారణంగా నిలిచింది. ఈ యుద్ధం ప్రారంభం కాగానే.. భారత్ తన గగనతలాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించింది. దీంతో తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ మధ్య భారత్ ఉండటంతో రెండు ప్రాంతాల మధ్య సైనిక సాయం నిలిచిపోయింది. యుద్ధం ప్రారంభమైన మూడు రోజుల్లోనే భారత వైమానిక దళం తూర్పు పాకిస్తాన్‌పై ఆధిపత్యం నెలకొల్పింది. ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రం మార్గం ద్వారా అందే సాయాన్ని అడ్డుకుంది. ఈ యుద్ధంలోనే ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి కోసం వచ్చిన పాక్ అత్యంత ఆధునాతనమైన సబ్‌మెరైన్ ఘాజీ బంగాళాఖాతంలో మునిగిపోయింది.

భారత సైన్యానికి చెందిన 4,33, 2 కార్ప్స్ మూడు దిశల నుంచి బంగ్లాదేశ్‌ని చుట్టుముట్టాయి. ఢాకా, చిట్టగాంగ్, సిల్హెట్, టాంగైన్, ఖుల్నా, జెస్సోర్ వంటి ప్రాంతాలన్నీ భారత సైన్యం ఆధీనంలోకి వచ్చాయి. అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ సామ్ మానెక్షా డిసెంబర్ 8న పాకిస్తాన్ సైనికులకు ఒక సందేశాన్ని పంపారు. ‘‘ మీరు లొంగిపోతే జనీవా ఒప్పందం ప్రకారం మిమ్మల్ని గౌరవంగా చూస్తాం’’ అంటూ హామీ ఇచ్చారు.

Read Also: Kuwait: కువైట్ రాజు షేక్ నవాఫ్ కన్నుమూత.. కొత్త పాలకుడిగా షేక్ మిషాల్..

అమెరికా, చైనా విఫలం:

పాకిస్తాన్‌ని రక్షించేందుకు అమెరికా, బ్రిటన్, చైనా వంటి దేశాలు చివరి వరకు ప్రయత్నించాయి. అయినా భారత విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. మరోవైపు శీతాకాలం కావడంతో దట్టమైన హిమాలయాల మంచును కాదని చైనా యుద్ధంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు యూఎస్ ప్రెసిడెంట్ నిక్సన్ అణుశక్తితో నడిచే విమానవాహక నౌక-యూఎస్ఎస్ ఎంటర్‌ప్రైజ్‌తో కూడిన సెవెంత్ ఫ్లీట్‌ని మోహరించాలని ఆదేశించారు. ఇది భారత ఐఎన్ఎస్ విక్రాంత్‌ని అడ్డుకుంటుందని నిక్సన్ భావించాడు. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి రష్యాతో భారత్‌కి మంచి మిత్రుత్వం ఉంది. ఆ సమయంలో రష్యా భారత్‌కి అండగా అణు క్షిపణులతో కూడిన సాయుధ యుద్ధనౌకల్ని, క్రూయిజర్లు/ట్యాంకులు, డిస్ట్రాయర్లతో భారత్‌కి అండగా నిలవడంతో పాకిస్తాన్‌కి అమెరికా సాయం కూడా దొరకలేదు.

చివరకు పాకిస్తాన్ బలగాలకు నేతృత్వం వహిస్తున్న జనరల్ నియాజీ డిసెంబర్ 13న పాక్ రావల్పిండికి సంకేతం పంపారు. ఇక పోరాటం కొనసాగించలేమని చెప్పాడు. దీని తర్వాత రోజు ఢాకాలోని గవర్నర్ హౌజ్ లో పాక్ అధికారులతో సమావేశం జరుగుతున్న సమయంలో భారత్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది. దీంతో తూర్పు పాకిస్తాన్ ప్రభుత్వం రాజీనామా చేసింది. చివరకు భారత్ ముందు లొంగిపోయింది.

Exit mobile version