Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు

  • హత్యకు ముందు, తర్వాత చాట్ హిస్టరీ డిలీట్..
  • కేతన్ హత్య కేసులో ఆధారాలు నాశనం చేసిన సియా, చేతన్
Ketan Murder Case

Ketan Murder Case

Ketan Agarwal Case: కేతన్ అగర్వాత్ హత్య కేసులో విచారణ వేగవంతమైంది. నిందితులు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలు హత్యకు ముందు, ఆ తర్వాత తమ మొబైల్ ఫోన్లలో చాట్ హిస్టరీ డిలీట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కీలక ఆధారాలను నాశనం చేసే ప్రయత్నంలోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. జూన్ 18న లోహ్‌గఢ్ కోటపై నుంచి కేతన్‌ను తోసేసి సియా హత్యకు పాల్పడింది. ఆ తర్వాత ఇద్దరూ చాట్ హస్టరీలను, రీసైకిల్ బిన్‌లోని డేటాను తొలగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో వారిద్దరి మొబైళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. డిలీట్ అయిన డేటాను రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

కేతన్‌తో వివాహం ఇష్టం లేని సియా పక్కా పథకం ప్రకారం హత్యకు పాల్పడింది. దీనికి ఆమె లవర్ చేతన్ సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హత్యకు ముందు ఏడాది కాలంలో సియా, చేతన్ మధ్య మొత్తం 2004 ఫోన్ కాల్స్ జరిగాయని, దాదాపుగా 238 గంటలు మాట్లాడుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు ఇద్దరూ ఓ కేఫేలో కలుసుకుని కుట్ర అమలు గురించి చివరిసారిగా చర్చించుకున్నట్లు తేలింది.

ఈ హత్యలో ప్లాన్ ప్రకారం, కోట వద్ద సియా నేలపై కూర్చోవడం ద్వారా చేతన్‌కు సిగ్నల్ ఇచ్చిందని, ఆ వెంటనే వెనక నుంచి వచ్చి కేతన్‌ను లోయలో తోసినట్లు పోలీసులు చెబుతున్నారు. మొదట సంఘటనా స్థలంలో తాను లేనట్లు చేతన్ అబద్ధాలు చెప్పినా, చివరకు ఇద్దరు ఈ హత్యలో తమ పాత్ర ఉన్నట్లు అంగీకరించారు. ఈ కేసులో సియా సోదరుడు, ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు, కేతన్ కుటుంబ కోరిక మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించేందుకు అంగీకరించింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను నియమించింది. ఈయన ముంబై దాడుల ఉగ్రవాది కసబ్‌కు ఉరిశిక్ష పడేలా చేశారు.