పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పెళ్లికి ముందు ప్రియుడి సాయంతో కాబోయే భార్య సియా గోయల్ లోయలోకి తోసేసి చంపేసింది. ప్రస్తుతం ఈ కేసు సంచలనంగా మారడంతో రాజ్యసభ సభ్యుడు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్ కుమార్ మిట్టల్ కీలక డిమాండ్ చేశారు. పురుషుల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
శనివారం సోషల్ మీడియా వేదికగా ‘ఎక్స్’లో 2025 డిసెంబర్‌లో రాజ్యసభలో ప్రవేశపెట్టిన నేషనల్ కమిషన్ ఫర్ మెన్ బిల్లు-2025కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. కేతన్ అగర్వాల్ హత్య కేసును ప్రస్తావిస్తూ.. పురుషులు కూడా బాధితులవుతున్నారని.. వారికి కూడా చట్టపరమైన రక్షణ, ఫిర్యాదులను పరిష్కరించే ప్రత్యేక వేదిక అవసరమని పేర్కొన్నారు.
అశోక్ కుమార్ మిట్టల్ మాట్లాడుతూ.. ‘‘కేతన్ కేసు పురుషులు కూడా బాధితులవుతారనే విషయాన్ని గుర్తు చేస్తోంది. వారికి సంస్థాగత మద్దతు, చట్టపరమైన రక్షణ, తమ గొంతును వినిపించే వేదిక అవసరం. న్యాయం అనేది లింగభేదం లేకుండా అందరికీ సమానంగా ఉండాలి” అని పేర్కొన్నారు.
ఏమిటి ఈ బిల్లు?
రాజ్యసభ వెబ్‌సైట్‌లో ‘‘ప్రవేశపెట్టబడిన బిల్లు’’గా నమోదైన National Commission for Men Bill, 2025ను 2025 డిసెంబర్ 5న ప్రైవేట్ మెంబర్ బిల్లుగా మిట్టల్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం పురుషుల హక్కులు, సంక్షేమాన్ని పరిరక్షించేందుకు చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పురుషులపై ప్రభావం చూపే చట్టాలు, విధానాలను సమీక్షించడం, వారి శారీరక, మానసిక, సామాజిక సంక్షేమానికి సంబంధించిన అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కమిషన్ బాధ్యతలుగా పేర్కొన్నారు.
కమిషన్ అధికారాలు, బాధ్యతలు
ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. విచారణల సందర్భంగా కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు కల్పించాలని సూచించారు. కమిషన్‌కు ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు న్యాయశాస్త్రం, ప్రజాపాలన, జెండర్ స్టడీస్, సామాజిక శాస్త్రం, మనోవిజ్ఞానం లేదా సామాజిక సేవ వంటి రంగాల్లో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉన్న సభ్యులు ఉండాలని ప్రతిపాదించారు. అలాగే ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి ప్రాతినిధ్యం ఉండాలని, కనీసం ఒక సభ్యుడు 40 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలని పేర్కొన్నారు.
పురుషుల రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనలను పరిశీలించడం, పురుషుల ఆత్మహత్యలు, ఆరోగ్య అసమానతలు, నిరుద్యోగం, పిల్లల సంరక్షణ హక్కులు, గృహ హింస వంటి అంశాలపై పరిశోధనలు నిర్వహించడం కమిషన్ ప్రధాన బాధ్యతలుగా బిల్లులో పేర్కొన్నారు. అలాగే ఇబ్బందుల్లో ఉన్న పురుషులకు ఉచిత న్యాయ సహాయం, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందించాలని ప్రతిపాదించారు. యువతలో లింగ సున్నితత్వం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ పరిపక్వత, హింసారహిత జీవన విధానంపై అవగాహన కల్పించేందుకు సీబీఎస్ఈ, ఎన్‌సీఈఆర్టీ, యూజీసీ వంటి సంస్థలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ బిల్లులోని నిబంధనలు మహిళలకు ప్రస్తుతం ఉన్న చట్టపరమైన రక్షణలను ఏ విధంగానూ బలహీనపరచవని స్పష్టం చేశారు. అలాగే మహిళ ఫిర్యాదుదారుగా ఉన్న కేసుల్లో, సంబంధిత ఫిర్యాదు తప్పుడు, దురుద్దేశపూర్వకమైనది లేదా చట్ట ప్రక్రియ దుర్వినియోగమని కోర్టు తేల్చినప్పుడు మాత్రమే ప్రతిపాదిత కమిషన్ జోక్యం చేసుకోగలదని పేర్కొన్నారు.
భారతదేశంలో ప్రైవేట్ మెంబర్ బిల్లులు చట్టాలుగా మారడం చాలా అరుదు. స్వాతంత్ర్యం తర్వాత ఇప్పటివరకు కేవలం 14 ప్రైవేట్ మెంబర్ బిల్లులే చట్టాలుగా మారాయి. 1970 తర్వాత ఏ ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పార్లమెంట్ రెండు సభల ఆమోదం పొందలేదు. ప్రస్తుతం దేశంలో జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) మాత్రమే చట్టబద్ధ సంస్థగా పనిచేస్తోంది. 1990 చట్టం ప్రకారం 1992లో ఏర్పాటైన ఈ కమిషన్ మహిళల హక్కుల పరిరక్షణ, చట్టాల సమీక్ష, ఫిర్యాదుల పరిష్కార బాధ్యతలను నిర్వహిస్తోంది.
Pune Ketan Agarwal case is deeply disturbing. Ketan and his family deserve a fair, thorough, and impartial investigation, and above all, justice.
I introduced the National Commission for Men Bill in Parliament. Every victim deserves justice, support, and equal protection under… pic.twitter.com/M6ENpG1T7F
— Ashok Kumar Mittal (@DrAshokKMittal) July 3, 2026

