NTV Telugu Site icon

Veterinary student Case: వయనాడ్ స్టూడెంట్ డెత్ కేస్.. 29 గంటల పాటు సీనియర్ల దాడి..

Veterinary Student Case

Veterinary Student Case

Veterinary student Case: కేరళలో సంచలన సృష్టించిన వయనాడ్ వెటర్నరీ విద్యార్థి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ ప్రారంభించింది. వయనాడ్ జిల్లాలో ఓ కాలేజ్ హాస్టల్‌లో 20 ఏళ్ల సిద్ధార్థన్ ఫిబ్రవరి 18న హాస్టల్ బాత్‌రూమ్‌లో చనిపోయి కనిపించాడు. కేరళ అధికార పార్టీ సీపీఎం విద్యార్థి విభాగమైన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) కార్యకర్తలతో సహా, ఇతర సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు తీవ్రంగా దాడి చేయడంతో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

సిద్ధార్థన్ ఆత్మహత్య చేసుకునేందుకు ముందు సీనియర్లు, ఇతర విద్యార్థులు కంటిన్యూగా 29 గంటల పాటు హింసించి దాడి చేశారని, కేరళ పోలీసులు సీబీఐకి అందించిన ఆత్మహత్య కేసు ఫైల్‌లో తెలిపారు. వైతిరి పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రశోభ్ పివి.. కేసు ఫైల్‌లో సిద్ధార్థన్‌ని సీనియర్లు, తోటివారు ‘‘శారీరకంగా మానసికంగా హింసించారు’’ అని రాశారు. ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 2 గంటల వరకు సిద్ధార్థన్‌పై బెల్టుతో నిరంతరం దాడి చేసి, క్రూరంగా ర్యాగింగ్‌కి పాల్పడ్డారు. దీంతో అతను మానసిక ఒత్తిడికి గురై ఫిబ్రవరి 18వ తేదీ మధ్యాహ్నం 12.30 నుంచి 13.45 గంటల మధ్య మెన్స్ హాస్టల్‌లో బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని మరణించాడని పోలీస్ నివేదిక పేర్కొంది.

Read Also: LSG vs GT: కేఎల్ రాహుల్‌ ‘స్పేర్‌ టైర్‌’ లాంటోడు.. సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ కేసులో 20 మందిపై వయనాడ్‌లోని వైత్తిరి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుపై రాజకీయ దుమారం చెలరేగడంతో మార్చి 9న కేరళ సీఎం పినరయి విజయన్ సీబీఐ విచారణకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత కూడా కీలక ఫైళ్లను ఇంకా సీబీఐకి అందచేయలేదని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఆరోపించడంతో ఈ అంశం పెద్ద వివాదానికి దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే సీబీఐ విచారణకు కాలయాపన చేసి సాక్ష్యాలను ధ్వంసం చేసిందని విద్యార్థి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

సీబీఐ దర్యాప్తు వేగవంతం చేస్తామని విద్యార్థి కుటుంబానికి తిరువనంతపురం లోక్‌సభ బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. విద్యార్థి తండ్రి జయప్రకాష్ తన కొడుకు చనిపోవడానికి 8 నెలల ముందు కూడా వేధింపులకు గురయ్యాడని ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు చాలా కాలంగా కాలేజీలోనే ఉంటున్నారని, తన కుమారుడి బట్టలు విప్పి మోకాళ్లపై కూర్చోబెట్టారని ఆరోపించారు.