Kerala: కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆకలి బాధతో ఉన్న ఓ వ్యక్తి చనిపోయిన పిల్లిని పచ్చి మాంసం తిన్నాడు. ఈ ఘటనను చూసిన ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన ఉత్తర కేరళ జిల్లాలోని కుట్టిప్పురంలో జరిగింది. అస్సాంకు చెందిన ఓ వ్యక్తి రోజుల తరబడి ఆహారం లేక పిల్లి పచ్చి మాంసాన్ని తింటూ కనిపించాడు.
Read Also: Jharkhand: హైదరాబాద్ నుంచి రాంచీకి ఎమ్మెల్యేలు.. రేపు అసెంబ్లీలో బల నిరూపణ
శనివారం సాయంత్రం రద్దీగా ఉండే బస్టాండ్ ఆవరణలో కూర్చుని, పిల్లి మాంసాన్ని తినడం అక్కడి ప్రజలు గమనించారు. సదరు వ్యక్తిని అస్సాం రాష్ట్రం ధుబ్రి జిల్లాకి చెందిన 27 ఏళ్ల వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బస్టాండ్ మెట్లపై కూర్చుని చనిపోయిన పిల్లి మాంసాన్ని తింటున్నట్లు స్థానికులు గమనించారని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. సమాచారం అందుకున్న తర్వాత తాము సంఘటన స్థలానికి చేరుకున్నామని, అతడిని విచారిస్తే.. గత 5 రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోలేదని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. సదరు వ్యక్తి అస్సాంలోని ఓ కళాశాల విద్యార్థి అని.. కుటుంబానికి చెప్పకుండా ట్రైన్ ఎక్కి డిసెంబర్‌లో కేరళకు వచ్చాడని తెలిసింది. విచారణలో చెన్నైలో పనిచేస్తున్న అతని సోదరుడి మొబైల్ నెంబర్ ఇచ్చినట్లు, అతడిని సంప్రదించి, వివరాలు ధ్రువీకరించుకున్నట్లు పోలీసులు తెలిపారు.