VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్‌లు వీరే!

Vd Satheesan

Vd Satheesan

VD Satheesan Oath Ceremony: కేరళలో కమ్యూనిస్టుల కంచుకోటను బద్ధలు కొట్టి యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి వీడీ సతీసన్ సోమవారం ఉదయం 10 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రివర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేస్తుందని సమాచారం. ఈ కొత్త ప్రభుత్వానికి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు పలువురు అగ్ర కాంగ్రెస్ నాయకులు కేరళకు రానున్నారని సమాచారం.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, “మంత్రుల జాబితాను ఈ సాయంత్రం గవర్నర్‌కు సమర్పిస్తాము. మంత్రులను నేరుగా ప్రకటించరు. ఇది చాలాకాలంగా పాటిస్తున్న సంప్రదాయం. కేరళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగే మంచి బృందాన్ని యూడీఎఫ్ రంగంలోకి దించుతుంది” అని అన్నారు. యూడీఎఫ్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు తిరువనంతపురానికి చేరుకుంటున్నారని చెప్పారు.