Site icon NTV Telugu

High Court: బిచ్చగాడిని భరణం కోరిన రెండో భార్య.. హైకోర్టు కీలక తీర్పు..

High Court

High Court

High Court: బిచ్చగాడు అయిన భర్తను, భార్య భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బిక్షాటన చేస్తూ బతికే తన అంధుడైన భర్త నుంచి భరణం కోరుతూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు చెప్పింది. ‘‘ఒక బిచ్చగాడిని తన భార్యకు భరణం చెల్లించమని బలవంతం చేయకూడదు’’ అని వ్యాఖ్యానించింది. అదే సమయంలో, నిరుపేద జీవిత భాగస్వాములకు ఆహారం, దుస్తులు అందేలా చూసుకోవడానికి రాష్ట్రం జోక్యం చేసుకోవాలని ఆదేశించింది.

ఈ కేసును విచారించిన కేరళ హైకోర్టు..‘‘ఒక భిక్షాటన పాత్రలో మరొకరు చేయి పెట్టవద్దు’’ అనే మలయాళ సామెతను ఉటంకిస్తూ, భిక్షపై ఆధారపడే వ్యక్తిని ఇతరులకు మద్దతు ఇవ్వమని బలవంతం చేయడం తగదని జస్టిస్ పి.వి. కున్హికృష్ణన్ అభిప్రాయపడ్డారు. ముస్లిం పర్సనల్ లా కింద రెండుసార్లు వివాహం చేసుకున్న సదరు వ్యక్తిని రెండో భార్య నెలకు రూ. 10,000 భరణం కోరింది. మలప్పురం ఫ్యామిలీ కోర్టు గతంలోనే ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. భరణం ఇప్పించలేమని చెప్పింది. దీంతో మహిళ హైకోర్టుకు అప్పీల్ చేసుకున్న తరుణంలో ఈ తీర్పు వచ్చింది.

Read Also: H-1B Visa: ట్రంప్ H-1B రూల్స్‌పై స్పందించిన భారత్.. ఏం చెప్పిందంటే..

భార్యలను పోషించే సమర్థత లేకుండా వరస వివాహాలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తులకు సరైన కౌన్సిలింగ్ అవసరమని నొక్కి చెప్పింది. అంధుడైన భర్త, తన భార్యపై శారీరకంగా దాడి చేరారనే ఆరోపణలను కూడా కోర్టు ప్రస్తావించింది. అలాంటి వాదనల్ని అంగీకరించడం కష్టమని పేర్కొంది. కానీ మానసికంగా, ఇతర రకాల క్రూరత్వాలకు అవకాశం ఉందని అంగీకరించింది. భర్త తన రెండవ భార్యపై తలాక్ చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుంటానని బెదిరించాడని, పోషించే సామర్థ్యం లేని, చదువు రాని వ్యక్తుల వల్ల వచ్చే నష్టాలను కోర్టు చెప్పింది.

ముస్లిం పర్సనల్ లా, ఖురాన్ సూత్రాలను ప్రస్తావిస్తూ, బహుళ భార్యలను న్యాయంగా నిర్వహించగల పురుషులకు మాత్రమే బహుభార్యత్వం అనుమతించబడుతుందని జస్టిస్ కున్హిక‌ృష్ణన్ స్పష్టం చేశారు. మరొక వివాహం చేసుకోకుండా, మత పెద్దలతో సహా అర్హత కలిగిన నిపుణుల ద్వారా భర్తకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి తీర్పు కాపీని కేరళ సామాజిక సంక్షేమ శాఖకు పంపాలని కోర్టు ఆదేశించింది.

Exit mobile version